Begin typing your search above and press return to search.

భారత పాస్ పోర్ట్ తో వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లవచ్చో తెలుసా?

By:  Tupaki Desk   |   12 Jan 2022 3:30 PM GMT
భారత పాస్ పోర్ట్ తో వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లవచ్చో తెలుసా?
X
ప్రపంచంలో అతి శక్తివంతమైన పాస్ పోర్టు ల జాబితాను హెన్లీ ఇండెక్స్ ఏటా విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు డేటా ఆధారంగా... టూరిస్ట్ వీసా లేకుండా వెళ్లగలిగే ఇతర దేశాల సంఖ్యను బట్టి ఈ జాబితాను సిద్ధం చేసింది. ఆ లిస్టు తాజాగా విడుదలైంది. ఇందులో మొదటి స్థానంలో జపాన్, సింగపూర్ ఉన్నాయి. ఇవి రెండు అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టులుగా హెన్లీ నివేదిక అభివర్ణించింది. టూరిస్ట్ వీసా లేకుండా సింగపూర్, జపాన్ పాస్ పోర్ట్ హోల్డర్లు ఏకంగా 192 దేశాలకు వెళ్లొచ్చు.

ఈ జాబితాలో భారతదేశం 83వ స్థానాన్ని సొంతం చేసుకుంది. కాగా గతేడాదితో పోల్చితే ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని ఈ స్థానంలో నిలిచింది. కాగా 2021తో భారత పాస్ పోర్టుతో టూరిస్టు వీసా లేకుండా 58 దేశాలకు వెళితే... ఈ ఏడాది మరో రెండు దేశాలు కూడా ఆ జాబితాలో చేరాయి. ఒమన్, అర్మేనియా దేశాలకు కూడా మన పాస్ పోర్టుతో వీసా లేకుండా వెళ్లవచ్చు. మొత్తంగా ఇండియన్ పాస్ పోర్టు హోల్డర్లు ముందస్తు వీసా యాక్సెస్ అవసరం లేకుండా ఏకంగా 60 దేశాలు సందర్శించవచ్చునని హెన్లీ నివేదిక వెల్లడించింది.

అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు జాబితాలో అప్గానిస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్ పోర్టుతో కేవలం 26 దేశాల్లో మాత్రమే పర్యటించవచ్చు. ఇక దాయాది దేశం పాకిస్థాన్ 108వ స్థానంలో నిలిచింది. పాక్ పాస్ పోర్టుతో 31 దేశాలను సందర్శించవచ్చు. ఈ మేరకు సమాచారాన్ని హెన్లీ అండ్ పార్ట్ నర్స్ గ్లోబల్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితాను తయారు చేసి విడుదల చేశారు.

199 దేశాల పాస్ పోర్టుల డేటా ఆధారంగా ఈ జాబితాను తయారు చేసినట్లు హెన్లీ సంస్థ వెల్లడించింది. వీసా లేకుండా యాక్సెస్ చేయగల దేశాల సంఖ్యను బట్టి వాటిని శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితా లోని స్థానాలు పొందుపరిచారు. ఇకపోతే వీసా పాలసీల్లో ఏమైనా మార్పులు జరిగితే వాటిని వెంటనే మార్పు చేస్తుంటారు. సో మన దేశం పాస్ పోర్టు సాయంతో 60 దేశాల్లోకి వెళ్లవచ్చు. భారత పాస్ పోర్ట్ హోల్డర్లు ఎటువంటి ముందస్తు వీసా యాక్సెస్ లేకుండా 60 దేశాల్లో గమ్యస్థానాలను సందర్శించవచ్చు.