Begin typing your search above and press return to search.

కరోనా కోసం కొత్త ద్వీపాలను వెతుకుతున్న దేశాలు

By:  Tupaki Desk   |   30 Jan 2020 1:30 PM GMT
కరోనా కోసం కొత్త ద్వీపాలను వెతుకుతున్న దేశాలు
X
ముప్పు తప్పదన్నప్పుడు అందుకు సిద్ధంగా ఉండటం.. దాన్ని ఎదుర్కోవటానికి తగినన్ని ఏర్పాట్లు చేసుకోవటం తప్పనిసరి. ఇప్పుడు అదే పనిలో పడ్డాయి వివిధ దేశాలు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను కంట్రోల్ చేయటానికి అవసరమైన వ్యాక్సిన్ అందుబాటు లో లేని వేళ.. దాన్ని తమ దేశంలో వ్యాప్తించకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చైనా లో మొదలైన ఈ వైరస్.. ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది.

మనిషి నుంచి మనిషికే కాదు.. జంతువుల నుంచి కూడా మనుషులకు పాకే ప్రమాదకరమైన కరోనా వైరస్ ను కట్టడి చేయటం అంత తేలికైన విషయం కాదు. ఇందుకోసం వైరస్ బాధితుల్ని ఉంచేందుకు.. వారికి వైద్యం చేసేందుకు ప్రత్యేక ప్రదేశాల్ని సిద్ధం చేసే దిశగా పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. వైరస్ తీవ్రత తమ భూభాగంలోకి అడుగు పెట్టటానికి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. దానిని నిరోధించటం సాధ్యం కాని వేళ.. ఈ వైరస్ బారిన పడిన వారిని.. దేశానికి దూరంగా ఉండే ద్వీపాల్లో ఉంచి వైద్యం చేయాలని భావిస్తున్నాయి.

ఇందులో భాగంగా పలు దేశాలు తమ దేశ భూభాగం పరిధిలోని ద్వీపాల్ని ఎంచుకుంటున్నాయి. ఈ ద్వీపాల్లో జన సంచారం లేని వాటిని గుర్తించి అక్కడకు వైద్యుల్ని.. వైరస్ బారిన పడిన వారిని పంపుతున్నాయి. ఆస్ట్రేలియా వరకే వస్తే.. తమ సమీపంలోని క్రిస్మస్ ద్వీపాన్ని ఎంచుకుంది. ఇందులో కరోనా బాధితులకు ఆశ్రయం కల్పించాలని నిర్ణయించింది. ఆస్ట్రేలియా ప్రధాన భూ భాగానికి రెండు వేల కిలో మీటర్ల దూరంలో ఉండే ఈ దీవిలో చైనా నుంచి వచ్చిన వారిలో కరోనా బారిన పడిన 600 మందిని అక్కడే ఉంచేందుకు డిసైడ్ అయ్యింది.

చైనాలో ఉన్న తమ దేశస్తుల్ని తమ దేశాలకు తిరిగి తీసుకుకొచ్చేందుకు పలు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేయటంతో పాటు.. అలా తీసుకొచ్చిన వారిని ప్రత్యేకమైన ద్వీపాల్లో పునరావాసం కల్పించటం ద్వారా కరోనా వైరస్ తో తిప్పలకు చెక్ చెప్పాలని భావిస్తున్నారు. అన్ని దేశాల్లోనూ కరోనా విషయం లో హైఅలెర్ట్ ప్రకటిస్తున్నారు. భారత్ లో ఇప్పటి వరకూ 9156 మంది ప్రయాణికులను పరీక్షించగా.. కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకూ బయటపడలేదు. చైనా నుంచి వస్తున్న ప్రయాణికుల విషయంలో భారత్ విమానాశ్రయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.