Begin typing your search above and press return to search.

UP.. MPలకు తెలుగు రాష్ట్రాల డబ్బులు ఇవ్వొద్దని కేంద్రానికి చెప్పు బండి!

By:  Tupaki Desk   |   9 Aug 2022 1:30 AM GMT
UP.. MPలకు తెలుగు రాష్ట్రాల డబ్బులు ఇవ్వొద్దని కేంద్రానికి చెప్పు బండి!
X
ఒకటే దేశం ఒకటే పన్ను.. ఒకటే దేశం ఒకటే విధానం అన్నట్లుగా నినదిస్తూ.. దేశం మొత్తాన్ని ఒకటిగా చేసి మాట్లాడే అలవాటు బీజేపీ నేతల మాటల్లో కనిపిస్తూ.. వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది అందుకు భిన్నంగా మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మోడీకి చురుకు పుట్టించేందుకు వీలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆ సందర్భంలో మరణించిన పంజాబ్ రైతు కుటుంబాలకు వెళ్లి ఆర్థిక సాయం అందించటం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న బండి సంజయ్.. సిరిసిల్లకు పంజాబ్ కు లింకు పెట్టి.. తెలంగాణ డబ్బుల్ని తీసుకుపోయి పంజాబ్ లో ఖర్చు పెట్టటం ఏమిటి? కావాలంటే సిరిసిల్లలో పెట్టుకో అంటూ చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు.

తాను చెప్పిన మాటలకు బండి సంజయ్ కట్టుబడి ఉండే పక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే జీఎస్టీ ఆదాయానికి సంబంధించిన మొత్తం షేర్ ను ఏపీ.. తెలంగాణకే ఇవ్వాలే తప్పించి.. యూపీ.. ఎంపీలకు ఇవ్వకూడదు కదా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. విభజన రాజకీయాల్ని పెంచేలా మాట్లాడుతున్న బండి మాటలు.. బీజేపీ ప్రాధమిక నినాదమైన ఒకటే దేశం మాటకు భిన్నంగా ఉండటాన్ని ఎత్తి చూపిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న జీఎస్టీ ఆదాయాన్ని.. కొంత మేర ఆయా రాష్ట్రాలకు ఇస్తున్న కేంద్రం.. మిగిలిన మొత్తాల్ని ఆదాయం తక్కువగా వచ్చే రాష్ట్రాల్లో డెవలప్ మెంట్ కోసం వినియోగిస్తున్న వైనం తెలిసిందే. యూపీలో పెద్ద ఎత్తున చేపట్టే డెవలప్ మెంట్ పనులతో పాటు.. యూపీకి ఇచ్చే నిధుల్లో కొంత వాటా తెలంగాణ.. ఏపీలకు చెందిన పన్ను ఆదాయం కూడా ఉంది. అలాంటప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పన్ను ఆదాయాన్ని మొత్తంగా ఏపీ.. తెలంగాణలకు ఇచ్చేస్తే మరింత డెవలప్ కావటానికి అవకాశం ఉంటుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు.

తాజాగా బండి నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్న వారు.. బీజేపీకి చెందిన కీలక నాయకుడు అయి ఉండి బండి నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలు ఆ పార్టీకి మూల సిద్ధాంతాన్ని తప్పు పట్టేలా.. వేలెత్తి చూపించేలా ఉన్నాయంటున్నారు. కేసీఆర్ ను ప్రశ్నించటానికి ముందు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వసూలు చేసే పన్ను ఆదాయాన్ని ఆయా రాష్ట్రాలకు పూర్తిగా వినియోగించాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. అప్పుడు కేసీఆర్ పంజాబ్ కు వెళ్లి రైతులకు పరిహారం ఇవ్వటాన్ని తప్పు పట్టొచ్చని చెబుతున్నారు.

తమ పార్టీ మూల సిద్ధాంతాన్ని వదిలేసి.. కేసీఆర్ ను ఇరుకున పడేసేలా మాట్లాడినట్లుగా భావిస్తున్న బండి సంజయ్ కు.. తన మాటలతో తన పార్టీకే ఇబ్బందన్న విషయాన్ని ఆయన గ్రహిస్తే మంచిందంటున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ కు సంబంధించిన ఆయన ఇచ్చిన హామీలు.. కేంద్రం నుంచి సాయం కోరి ఏదేదో చేస్తానని చెప్పిన ఆయన.. ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయలేదన్న విషయానికి సంబంధించి కూడా సమాధానం చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది. చూస్తుంటే.. బండి సంజయ్ మాట్లాడేటప్పుడు మరింత ఆచితూచి అన్నట్లు మాట్లాడితే మంచిది.లేదంటే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని ఆయన గ్రహించాల్సిన అవసరం ఉంది.