Begin typing your search above and press return to search.

విశాఖ రాజధాని కోసం కౌంటర్ పాదయాత్ర... ?

By:  Tupaki Desk   |   11 Nov 2021 10:23 AM GMT
విశాఖ రాజధాని కోసం కౌంటర్ పాదయాత్ర... ?
X
విశాఖను పాలనా రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించింది. అదే విధంగా ఏపీలో మూడు రాజధానులను ప్రతిపాదించింది. అమరావతిని శాసన రాజధానిగా చేసింది. దీంతో అమరావతి రైతులు రగిలిపోయారు. తమకు న్యాయం జరగాలంటూ వారు ఏడాదికి పైగా అక్కడ ఆందోళన చేస్తూ వచ్చారు. అయితే అది కేవలం 29 గ్రమాలకు సంబంధించిన సమస్య మాత్రమే అని వైసీపీ సర్కార్ చెబుతూ వస్తోంది. దాని ప్రభావం కూడా ఏపీలో ఎక్కడా లేదని కూడా అంటోంది. మరో వైపు తీసుకుంటే అమరావతి రాజధాని రైతులు తన పోరాటాన్ని తాజాగా మరింత ఉధృత్రం చేశారు. ఏకంగా న్యాయస్థానం టూ దేవస్థానం అని కోస్తా జిల్లాలు అన్నీ దాటుకుని రాయలసీమలోని తిరుపతి దాకా చేస్తున్నారు. ఇది ప్రస్తుతం జోరుగా సాగుతోంది.

దీంతో ఏపీలో అమరావతి రాజధానికి మద్దతు పెరుగుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఇంతకాలం తామున్న చోటనే ఆందోళన చేస్తూ వచ్చిన అమరావతి రైతులు ఇలా కొత్త స్టెప్ తీసుకోవడంతో దాని ప్రభావం మూడు రాజధానుల మీద కూడా పడుతుందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఈ నేపధ్యంలో విశాఖను పాలనా రాజధానిని కాపాడుకోవాలంటూ కొన్ని స్వచ్చంద సంస్థలు, ప్రజా సంఘాలు ముందుకు వస్తున్నాయని చెబుతున్నారు. వీరంతా కలసి ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున పాదయాత్ర చేడతారు అని అంటున్నారు. ఇక్కడ ఉన్న మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో కూడా పాదయాత్ర సాగుతుందని అంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం అయిదేసి రోజుల పాటు పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ ని కూడా రెడీ చేస్తున్నారుట.

ఇదిలా ఉంటే ఈ పాదయాత్ర వెనక ఎవరు ఉన్నారు అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి.ఈ పాదయాత్ర చేయాలనుకుంటున్న వారు వైసీపీ నేతలతో చర్చించారని, ముఖ్య నేతలను కలసి మద్దతు కోరారని టాక్ నడుస్తోంది. అయితే దీని మీద వైసీపీ నేతలు కూడా అంతర్గతంగా చర్చించుకున్నారని, తాము బాహాటంగా మద్దతు ఇవ్వడం సబబు కాదని ఆలోచిస్తున్నారని అంటున్నారు. విశాఖ రాజధాని మీద పోరాటం పార్టీలకు అతీతంగా జరగాలంటే తమ ముద్ర ఉండరాదని కూడా వారు భావిస్తున్నారుట. దాంతో పాదయాత్రను స్వచ్చంద సంస్థలే భుజానికెత్తుకుంటే తెర వెనక మద్దతు ఇస్తారని చెబుతున్నారు.

మొత్తానికి ఉత్తరాంధ్రా పాదయాత్ర అయితే ప్రతిపాదన దశలో ఉంది. ఇది కార్యరూపం దాలిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లో రాజకీయం ఏ తీరున మారుతుంది అన్న చర్చ కూడా వస్తోంది. నిజానికి టీడీపీని ఉత్తరాంధ్రాలో దెబ్బ కొట్టడానికే వైసీపీ విశాఖ రాజధాని ప్రతిపాదన తెచ్చింది అని అంటారు. ఇపుడు కూడా పాదయాత్ర కనుక స్టార్ట్ చేస్తే టీడీపీనే టార్గెట్ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి విశాఖ పాలనా రాజధాని కావాలంటూ పాదయాత్ర చేయడం వెనక రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయా అన్న డౌట్లు వస్తున్నాయి. అమరావతి రైతుల పాదయాత్రను కౌంటర్ చేయడం ద్వారా ఏపీలో మూడు రాజధానుల మీద హాట్ హాట్ గా చర్చ కొనాసాగాలన్నదే తెర వెనక పెద్దల ఉద్దేశ్యంగా కనిపిస్తోంది