Begin typing your search above and press return to search.

అక్కడ ఇంటి ఖరీదు రూ.87 మాత్రమే.. ఎందుకిలా?

By:  Tupaki Desk   |   24 Aug 2021 3:32 AM GMT
అక్కడ ఇంటి ఖరీదు రూ.87 మాత్రమే.. ఎందుకిలా?
X
మాంచి హోటల్లో రెండు ఇడ్లీ ఖరీదు రూ.100. మరో మాటలో చెప్పాలంటే.. కాఫీ డేలో కాఫీ తాగాలంటేనే రూ.200 వరకు వస్తుంది. అలాంటిది ఒక ఇంటిని కేవలం రూ.87 (మన రూపాయిల్లో ఆ దేశపు కరెన్సీ లెక్కలో అయితే ఒక్క యూరో మాత్రమే)లకే ఇచ్చేస్తున్నారు. ఎందుకిలా? ఇంత తక్కువకు ఎందుకిస్తున్నారు? ఇంతకీ అంతటి బంఫర్ ఆఫర్ ఎందుకు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

కేవలం రూ.87కే ఇంటిని ఇచ్చేస్తున్న ప్రాంతం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన ఇటలీ దేశంలో. ఆ దేశంలో బిసాసియా అనే అందమైన ఊరు ఉంది. ఇది దేశ రాజధాని రోమ్ మహానగరానికి 70కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఊళ్లో ఒక యూరోకంటే తక్కువ ధరకే ప్రభుత్వం ఇళ్లను అమ్ముతుంది. అది కూడా సువిశాలమైన ఇంటిని ఇంత తక్కువ ధరకు అమ్మటానికి కారణం.. ఆ ఊళ్లోని ఇళ్లలో 90 శాతం శిధిలావస్థకు చేరుకోవటం వల్లనేనని చెబుతున్నారు. అంతేకాదు.. ఒకప్పుడు ఆ ఊరు మొత్తం ప్రజలతో కళకళలాడేది. అలాంటిది ఇప్పుడు బోసిపోవటంతో.. ప్రభుత్వం ఆ ఊరికి పాత రోజుల్ని తెచ్చేందుకు భారీ ప్లాన్ వేసింది.

ఒకప్పటి బిసాసియా నగరంలా తిరిగి అభివృద్ధి చేసేందుకే ఇలా ఇళ్లను కారుచౌకకు ఇచ్చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి ఈ ఊరు ఒకప్పుడు కళకళలాడుతూ ఉండేది. కానీ.. 1968లో వచ్చిన భూకంపం ఆ ఊరు నుంచి చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయేలా చేసింది. దీంతో.. బిసాసియా నగరం ఖాళీ అయ్యింది. ఇప్పుడు అక్కడ ప్రజలు నివసించకుండా ఖాళీ ఇళ్లే దర్శనమిస్తున్నాయి. దీంతో.. ఆ ఊరిని మళ్లీ కళకళలాడేలా చేయటం కోసం ఒక యూరో కంటే తక్కువ ధరకు ఇంటిని ఇచ్చేస్తామని ఆఫర్ ఇస్తోంది అక్కడి ప్రభుత్వం.

ఈ ఊరు చాలా పాతది కావటంతో.. రోడ్డు పక్కనే ఇళ్లు.. ఒకదాని పక్కనే మరొకటి ఉండటంతో.. అన్ని కుటుంబాలు పక్కపక్కనే కలిసి ఉండటానికి వీలుంటుందని చెబుతున్నారు. ఇంత కారుచౌకకు ఇంటిని ఇస్తున్నారంటే ఏదో.. ఒక రూల్ ఉండి ఉంటుందనే మాట నిజమే. ఈ ఇంటినికొనే ముందు ఒక ఒప్పందం చేసుకోవాలి. ఇంటి రిపేర్లు కొన్న వారే చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఇంటిలా మార్చుకోవటానికి మూడేళ్లు గడువు ఇస్తారు.

ఈ ఒప్పందంలో భాగంగా డిపాజిట్ రూపంలో 5వేల యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటిని రిపేర్ చేయటమో.. కొత్తగా నిర్మించుకోవటం చేసిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఉన్నంతలో మంచి రూల్ ఏమంటే.. కొత్తగా నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోనే కచ్ఛితంగా ఉండాలన్న రూల్ మాత్రం లేదు. మరి.. ఇదెంత వరకు వర్కువుట్ అవుతుందో చూడాలి.