Begin typing your search above and press return to search.

కృత్రిమ గర్భధారణ ఖర్చు భరించలేక.. వీర్యదాతను ఇంటికి పిలిచి..

By:  Tupaki Desk   |   21 Sep 2021 7:02 AM GMT
కృత్రిమ గర్భధారణ ఖర్చు భరించలేక.. వీర్యదాతను ఇంటికి పిలిచి..
X
తన తోలి భర్తతో కలహాల కారణంగా అతడికి దూరమైంది. అయితే ,అప్పటికే ఆమెకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. దీనితో మొదటి బిడ్డకు తోడుగా రెండో సంతానం కావాలని కోరుకుంది. అయితే..మరో వ్యక్తికి దగ్గరయ్యే బదులు..కృత్రిమ గర్భధారణ ద్వారా సంతానాన్ని పొందేందుకే ఆమె మొగ్గుచూపింది. ఈ క్రమంలో తీసుకున్న ఓ నిర్ణయం ఆమెను వార్తల్లో వ్యక్తిగా నిలిపింది. బ్రిటన్‌ కు చెందిన స్టెఫానీ టేలర్ ఉదంతం ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. స్టెఫానీ టేలర్‌కు 33 ఏళ్లు. భాగస్వామితో గొడవల కారణంగా అతడి నుంచి విడిపోయింది. ఆమెకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. అయితే..అతడు ఇలా ఒంటరిగా పెరగడం ఆమెకు ఇష్టం లేదు. దీని వల్ల అతడి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆమె భయపడింది. అలాగని ఇష్టం లేని వ్యక్తితో కలిసుండటం కూడా ఆమెకు నచ్చలేదు.

దీనితో కృత్రి మగర్భదారణ ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకుంది. కానీ, ప్రైవేటు క్లినిక్ వారు చెప్పిన రేట్లు విని ఆమెకు దిమ్మతిరిగింది. ఇందుకోసం ఏకంగా 1600 పౌండ్లు ఖర్చు అవుతుందని (మన కరెన్సీలో ఇది రూ 1.6 లక్షలు) తెలియడంతో నిరాశ చెందిన ఆమె చివరికి పరిస్థితులను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆమె మొదట యూట్యూబ్‌, ఇంటర్నెట్ ద్వారా కృత్రిమ గర్భధారణ పద్ధతిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఆ తరువాత.. ఓ యాప్ ద్వారా వీర్యదాతను సంప్రదించింది. అతడు నేరుగా ఆమె ఇంటికి వచ్చి వీర్యాన్ని ఇచ్చి వెళ్లాడు. మరోవైపు.. ఈబే లో కృత్రిమగర్భధారణ కిట్‌ ను కొనుగోలు చేసింది.

ఆ తర్వాత యూట్యూబ్‌ లో చూపించిన విధంగా కృత్రిమ గర్భధారణ ప్రక్రియను పూర్తి చేసింది. ఫలితంగా ఆమె గతేడాది అక్టోబర్‌ లో ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఈడెన్‌ అని పేరుపెట్టుకుంది. అయితే, స్టెఫానీ నిర్ణయంతో ఆమె తల్లి, సోదరి పూర్తిగా ఏకీభవించినప్పటికీ, తండ్రి మాత్రం తొలుత ఆమోదించలేకపోయారు. కొంత కాలం తరువాత తన మనసు మార్చుని కూతురికి మద్దతుగా నిలిచారు. ఇక..ఆధునిక సాంకేతికత అందుబాటులో లేకపోతే ఇందంతా సాధ్యమయ్యేది కాదని స్టెఫానీ చెప్పింది. తన కూతురు అసలు సిసలైన ‘ఆన్‌ లైన్ చిన్నారి’ అంటూ సంబరపడిపోయింది స్టెఫానీ. వీర్యదాత మాత్రం తన వివరాలు గోప్యంగానే ఉండాలని కోరుకుంటున్నాడు. స్టెఫానీ కోరుకుంటే మాత్రం మరోసారి వీర్యదానం చేసేందుకు తాను సిద్ధమని చెప్పాడు. ఈడెన్‌ భవిష్యత్తులో తన జన్యుదాతను కలవాలనుకంటే తనకు ఎటువంటి అభ్యంతరం ఉండదని కూడా స్టెఫానీ చెప్పింది.