Begin typing your search above and press return to search.

బాబు దోపిడీ ఏస్థాయిలో ఉందో చెప్పిన మాజీ సీఎస్

By:  Tupaki Desk   |   19 Nov 2018 12:18 PM IST
బాబు దోపిడీ ఏస్థాయిలో ఉందో చెప్పిన మాజీ సీఎస్
X
ప్రభుత్వంలో పనిచేసే వారికే తెలుస్తాయి అసలు గుట్లు.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సీఎస్ గా పనిచేసి రైటర్ మెంట్ అయిపోయిన మాజీ సీఎస్ అజయ్ కల్లం బాబు గారి బండారం బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం అవినీతి కథను ఆయన బహిరంగంగా వెల్లడించి సంచలనం సృష్టించాడు. గడిచిన నాలుగున్నరేళ్లుగా జరిగిన పలు కుంభకోణాల గురించి సంచలన విషయాలను వెల్లడించాడు. అది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పెడుతోంది.

ఏపీ ప్రభుత్వ సీఎస్ గా చంద్రబాబు చేసే పనులన్నీ అజయ్ కల్లాంకు తెలుసు. ఆయన ఎన్ని నిధులను ఎలా ఖర్చు చేయాలన్నా ప్రభుత్వ అధికారిగా అజయ్ కల్లం చేతే కథ నడిపించాలి. దీంతో అప్పట్లో బాబు చేసిన అవినీతి గుట్టు మట్లను తాజాగా తిరుపతిలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో అజయ్ కల్లం వెల్లడించారు.

ఉపాధి హామీ పథకానికి కేంద్రం 20వేల కోట్లు ఏపీకి ఇస్తే అందులో మూడో వంతు నిధులు దోపిడీకి గురయ్యాయని మాజీ సీఎస్ అజయ్ కల్లం ఆరోపించారు. మార్కెట్ లో 4వేల ఫోన్ ను రూ.7500 కొనుగోలు చేసి ఇలా 5 లక్షల ఫోన్లు కొని పంచారని.. ఇందులోనే 150 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. ఐటీ సిటీ పేరుతో 450 కోట్ల భూమిని 45 లక్షలకే కట్టబెట్టారని మండిపడ్డారు.

ఇక ఏపీ చేస్తున్న పథకాలంటూ ప్రచారం కోసమే గడిచిన నాలుగేళ్లలో ఒక చానెల్ కు ఏకంగా ఏడువందల కోట్లు ప్రభుత్వం చెల్లించిందని అజయ్ కల్లం సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఖర్చుచేయాల్సిన సొమ్మును ఇలా ప్రచారానికి ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబు తన అక్రమ సంపాదనను తెలంగాణ - గుజరాత్ - కర్ణాటక ఎన్నికలకు ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

అజయ్ కల్లం ఆరోపించిన ఆ చానెల్ ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి రాకముందు అప్పుల్లో ఉన్న ఆ చానెల్ కు ఇప్పుడు దోచిపెట్టి ఇప్పుడు బలంగా తయారు చేశారని.. సహరించినందుకు ఇలా రుణం తీర్చుకుంటున్నారని అర్థమవుతోందంటున్నారు. టీడీపీపై ఈగవాలనీయని చానెల్ .. ప్రతిపక్షాలను మాత్రం ఏకిపారేయడమే పనిగా పెట్టుకుందని చెబుతుంటారు..