Begin typing your search above and press return to search.

కార్పొరేట్లకు కరోనా అస్సలు పట్టదా?

By:  Tupaki Desk   |   25 March 2020 2:30 AM GMT
కార్పొరేట్లకు కరోనా అస్సలు పట్టదా?
X
కొన్ని విషయాలు ఆలోచిస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మరీ.. ఇంతలానా? అన్న అక్రోశం మనసును పట్టి పీడుస్తుంటుంది. కరోనా మీద అంత చేస్తున్నాం.. ఇంత చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. నిజమే.. వారు చేయగలిగింది చేస్తున్నారనుకుందాం. అది సరిపోతుందా? అంటే అదో పెద్ద ప్రశ్న. కరోనా మీద యుద్ధమే చేస్తున్నామని చెప్పే ప్రధాని మోడీ దగ్గర నుంచి మన కేసీఆర్.. మన జగన్ చాలామంది పాలకులు.. ఇప్పుడు ఎదురైన గడ్డు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న అంశం మీద భారీగానే కసరత్తు చేస్తున్నారు.

ఇదంతా బాగానే కనిపిస్తున్నా.. అసలు విషయాల్ని అస్సలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు షాకింగ్ గా మారింది. కరోనా దేశంలోకి అడుగు పెట్టి పెట్టగానే చాలా రాష్ట్రాల్లో శానిటైజర్ల సమస్యతో పాటు.. మాస్కుల సమస్య తీవ్రంగా ఉంది. అప్పటివరకూ రెండు..మూడు రూపాయిలు అమ్మిన మాస్కులు సైతం పది రూపాయిలకు చేరుకుంటే.. యాభై.. అరవై రూపాయిలకు అమ్మే మాస్కులు ఇప్పుడు రూ.300 - 400 వరకూ పలుకుతున్నాయి.

దీనికి తోడు కొరత వీటి కొరత భారీగా ఉంది. ఇప్పటివరకూ ఆ సమస్య మీద ప్రభుత్వాలు ఫోకస్ చేసింది లేదు. శానిటైజర్ల కొరతను తగ్గించే అంశం మీద అటు ప్రభుత్వాలే కాదు.. ఇటు కార్పొరేట్లు సైతం నడుం బిగించలేదు. కరోనాకు చెక్ పెట్టేందుకు అవసరమైన అతి ముఖ్యమైన ఆయుధాలైన శానిటైజర్లు.. మాస్క్ ల్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే సత్తా రిలయన్స్ అంబానీ.. కుమార మంగళం బిర్లా.. టాటా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది కార్పొరేట్లకు లేదు? ఇప్పటికిప్పుడు లేదనే అనుకుందాం. ప్రత్యేక పరిస్థితుల్లో వాటి ఉత్పత్తి మీద ఫోకస్ పెడితే తప్పుందా?

మాకు ప్రవేశం లేని రంగానికి సంబంధించిన ఉత్పత్తుల్ని చేయమని అడుగుతారెందుకు? ఫార్మా వాళ్లు ఏం చేస్తున్నారన్న ప్రశ్న రావొచ్చు. నిజమే.. అరబిందో.. సిప్లా.. రెడ్డి ల్యాబ్.. అపోలో గ్రూపు..ఇలా చెప్పుకుంటూ పోతే ఫార్మాకు సంబంధించి మనోళ్లు చాలానే తోపులు. వారికి మాస్కుల తయారీకి ఎలాంటి లింకు లేకపోవచ్చు. కానీ.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మాస్కుల తయారీ మీదా.. శానిటైజర్ల తయారీని ఎందుకు చేపట్టకూడదు? ఒక వ్యాపారంలో ప్రవేశం ఉన్నవాళ్లు.. అవసరమైతే.. ఏ వ్యాపారాన్ని అయినా చేయగలరు. అదేమీ మీరు మాటలు చెప్పినంత తేలిక కాదని అనొచ్చు. నిజమే.. కాస్త ఇబ్బందులు ఉండొచ్చు. కానీ.. అదేదీ కరోనా లాంటి పిశాచితో యుద్ధం చేసే కష్టానికి మించింది కాదన్నది మర్చిపోకూడదు. మన కార్పొరేట్ ప్రముఖులకు కరోనాపై యుద్ధం చేసేందుకు ప్రజలకు అందివ్వాల్సిన ఆయుధాల గురించి ఎందుకు అలోచించట్లేదు?