Begin typing your search above and press return to search.

ఫీజులు చూస్తే త‌ల్లిదండ్రుల గుండెల్లో ద‌డ‌

By:  Tupaki Desk   |   11 July 2020 6:00 AM GMT
ఫీజులు చూస్తే త‌ల్లిదండ్రుల గుండెల్లో ద‌డ‌
X
ప్ర‌స్తుత ఆప‌త్కాల స‌మ‌యంలోనూ కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యా సంస్థలు త‌మ దోపిడీ ప‌ర్వం కొన‌సాగిస్తున్నారు. గ‌తానిక‌న్నా భారీగా ఫీజులు వ‌సూలు చేస్తున్నారు. కొద్దిరోజుల్లో విద్యాసంస్థ‌లు పునఃప్రారంభ‌మ‌వుతాయ‌ని భావించి త‌ల్లిదండ్రులు పాఠ‌శాల‌ల‌కు వెళ్ల‌గా వారు చెప్పే ఫీజులు చూస్తే గుండెలు అదురుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఫీజులు వసూళ్ల‌కు పాల్ప‌డుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను బ‌ల‌వంతంగా ఫీజులు వ‌సూలు చేసేలా వారి వ్య‌వ‌హారం ఉంది. పర్యవేక్షణ లేక‌పోవ‌డంతో ప్రైవేటు విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులు, అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థలు యథేచ్ఛగా దోపిడీ దందా కొనసాగిస్తున్నారు. ఫీజుల‌పై ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.46 బేఖాత‌ర్ చేస్తున్నాయి. ర‌క‌రకాల పేర్లు చెప్పి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించిన యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్స్‌ ఇవ్వమంటూ త‌ల్లిదండ్రుల‌కు సందేశాలు పంపుతున్నారు. విద్యా సంవత్సరంపై నీలిమేఘాలు అలుముకోవ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఆందోళ‌న చెందుతున్నారు.

హైద‌రాబాద్‌లోని ప‌లు పాఠ‌శాల‌ల్లో అడ్మిషన్‌ మొదలుకొని వివిధ ఫీజుల కింద రూ.లక్ష డిమాండ్ చేస్తున్నారు. ఆ ఫీజుల్లో రాయితీ కోరితే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని హైస్కూల్‌లో రెండో తరగతి విద్యార్థికి స్కూలు ఫీజు కింద రూ.60 వేలు, యాక్టివిటీ ఫీజు కింద మరో రూ.40 వేలు కలిపి రూ.లక్షగా చెబుతున్నారు. దీనికి అదనంగా రవాణా, పుస్తకాలు తదితరాలు అదనంగా ఉంటాయని ఉంటాయని వివ‌రిస్తున్నారు. మ‌రో కార్పొరేట్‌ స్కూల్‌లో ట్యూషన్‌ ఫీజుగా రూ.31 వేలు, పుస్తకాలు, యూనిఫాం తదితరాలకు మరో రూ.7,500 చెల్లించాలని కోరుతున్నారు. ఇది పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు భారంగా మారింది. ఈ ప‌రిస్థితి హైద‌రాబాద్‌లోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూల్‌లో ఇలాగే ఉంది.

ఇక పాఠ‌శాల‌ల్లో కొత్తగా చేరాలనుకునేవారికి ఫీజులు చూస్తే స‌ర్కార్ బ‌డికి పంపించ‌డ‌మే మేల‌ని భావిస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో అధికంగా రాబ‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. విద్యా సంవత్సరంపై క్లారిటీ రాక‌పోవ‌డంతో ప్రైవేటు విద్యా సంస్థలు తమ సొంత సిలబస్‌తో ఆన్‌లైన్‌ క్లాసుల్ని మొదలెట్టేశాయి. ఫీజుల పేరుతో ప్రతి పైసా బ‌ల‌వంతంగా వసూలు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులు జ‌రుగుతున్నా యాజమాన్యాలు మాత్రం ట్యూషన్‌ ఫీజు, బిల్డింగ్‌ ఫీజు, స్కూలు యూనిఫాం ఫీజు, స్కూలు డెవలప్‌మెంట్‌ ఫీజు, ట్రాన్స్‌పోర్ట్‌ ఫీజు... ఇలా ర‌క‌ర‌కాల పేరుతో భారీగా తల్లిదండ్రుల నుంచి రాబ‌డుతున్నాయి. ఇదిలా ఉంటే మ‌రోటి ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసిన ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు తమ వద్దే కొనాలంటూ నిబంధ‌న విధిస్తున్నాయి. వీటిలో ఏ ఫీజు చెల్లించకపోయినా, పుస్తకాలు కొనకపోయినా ఆన్‌లైన్‌ క్లాసుల యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇవ్వమని, పరీక్షలు రాయనిచ్చేది లేదంటూ ఎస్సెమ్మెస్‌లు, ఫోన్‌కాల్స్‌ ద్వారా తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నాయి.

ఈ ఆన్‌లైన్‌ క్లాసుల కోసం గంటల తరబడి ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్‌టాప్స్‌ చూస్తున్న పిల్లల కళ్లు, వెన్నుముకలపై తీవ్ర ప్రభావం ప‌డుతోంది. దీంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో త‌మ‌కు ఏమిటీ క‌ష్టాలు ఏమిట‌ని భ‌యాందోళ‌న ప‌డుతున్నారు. డిజిట‌ల్ విద్య వ‌ద్దు.. అస‌లు ఈ విద్యా సంవ‌త్స‌రం వ‌దులుకునేందుకు సిద్ధ‌ప‌డుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి.