Begin typing your search above and press return to search.

భయం పుట్టించేలా హైదరాబాద్ పాతబస్తీ గ్రౌండ్ రిపోర్టు

By:  Tupaki Desk   |   22 April 2020 8:00 PM IST
భయం పుట్టించేలా హైదరాబాద్ పాతబస్తీ గ్రౌండ్ రిపోర్టు
X
వణికిస్తున్న కరోనా వైరస్ కు ముకుతాడు వేసేందుకు లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని.. దాంతోనే ప్రమాదకర వైరస్ ను కంట్రోల్ చేయొచ్చన్న వాదనను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ వినిపిస్తున్నారు. ఆయన చెప్పే మాటల్ని విన్నప్పుడు కరోనా ప్రమాదం ఎంతలా పొంచి ఉందన్న విషయం ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. అలాంటివేళలోనూ కరోనా కేసులు అంతకంతకూ ఎందుకు పెరుగుతున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేయగా.. హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో లాక్ డౌన్ నిబంధనలు అమలు కావటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల తలాబ్ కట్టలో ఎలాంటి పరిస్థితి నెలకొందన్న విషయాన్ని మజ్లిస్ పార్టీకి చెందిన టీవీ న్యూస్ ఛానల్ ఒకటి కళ్లకు కట్టినట్లుగా రిపోర్టు చేసింది. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ అందించిన కథనాన్ని చూసినప్పుడు కూడా ఇదే విషయం స్పష్టమవుతుందని చెప్పాలి. హైదరాబాద్ లో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం పాతబస్తీ పరిధిలోనే ఉన్నట్లుగా చెబుతున్నారు.

లాక్ డౌన్ అక్కడ సరిగా అమలు కావటం లేదన్న విమర్శ ఉంది. కరోనా భయం లేకుండా పాతబస్తీకి చెందిన వారు రోడ్ల మీదకు వస్తున్నారని.. వారిని కంట్రోల్ చేసే విషయంలో పోలీసులు ఫెయిల్ అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో నిబంధల్ని ఉల్లంఘించి రోడ్ల మీదకు వచ్చే వాహనాల్ని సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీలో అలాంటి సీన్లు తక్కువగా చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

సాధారణ రోజుల్లో ఎలా అయితే రోడ్ల మీదకు ప్రజలు వస్తున్నారో? అదే రీతిలోనే ప్రస్తుతం ఉందంటున్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్న వేళ అక్కడున్న పరిస్థితి చూస్తే.. అసలు లాక్ డౌన్ అమల్లో ఉందా? అన్న అనుమానం కలుగక మానదు. ఈ వ్యవహారంలో ఎవరో తప్పు పట్టే కన్నా.. అక్కడి వారికి అర్థమయ్యేలా.. కరోనా తీవ్రత తెలిసేలా అధికారులు.. రాజకీయ నేతలు.. ఇతర సేవా సంస్థలు.. అధ్యాత్మిక సంస్థలు ఉమ్మడిగా ప్రయత్నిస్తే తప్పించి ఫలితం లేదంటున్నారు.

లేకుంటే పరిస్థితులు మరింతగా దిగజారుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మలక్ పేట మొదలు టోలిచౌకి వరకూ ఉన్న పాతబస్తీ పరిధి మొత్తాన్ని ప్రత్యేక జోన్ గా తీసుకొని.. భారీ ఎత్తున అధికార గణాన్ని దింపి లాక్ డౌన్ నియమావళిని కఠినంగా అమలు చేయాల్సి ఉందన్న అభిప్రాయం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మరి.. దీనికి ప్రభుత్వం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.