Begin typing your search above and press return to search.

కరోనాను జయించాడు..గాంధీ నుంచి ఎవరికీ తెలీకుండా డిశ్చార్జ్

By:  Tupaki Desk   |   14 March 2020 3:10 AM GMT
కరోనాను జయించాడు..గాంధీ నుంచి ఎవరికీ తెలీకుండా డిశ్చార్జ్
X
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తొలి పాజిటివ్ కేసుకు సంబంధించిన ఉదంతం కొద్ది రోజుల క్రితం బయటకు రావటం.. ఒక్కసారిగా అందరూ ఉలికిపాటుకు గురి కావటం తెలిసిందే. మార్చి ఒకటో తేదీన గాంధీలోని ఐసోలేషన్ వార్డులో కరోనా అనుమానంతో చేరిన అతడికి పాజిటివ్ అన్న విషయాన్ని ఫూణెలోని ల్యాబ్ నిర్దారించటం తెలిసిందే. పాజిటివ్ అన్న తర్వాత సదరు యువకుడ్ని గాంధీలోని అత్యవసర విభాగంలోని కోవిడ్ అక్యూట్ ఐసీయూలో ఉంచి వైద్యసేవల్ని అందించారు.

కరోనాను జయించిన ఆ యువకుడిలో వైరస్ లక్షణాలు ఏమీ లేకపోవటం.. అతడికి మరోసారి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడ్ని శుక్రవారం రాత్రి గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కరోనాను జయించిన ఆ యువకుడ్ని మీడియా కంట పడకుండా జాగ్రత్తగా అతడి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. కరోనాను జాయించిన యువకుడ్ని డిశ్చార్జ్ చేస్తారన్న విషయాన్ని తెలుసుకున్న మీడియా గాంధీ ఆసుపత్రికి వెళ్లింది. అయితే.. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఐసీయూలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని భోజనాలు చేసి రావాలంటూ పంపించి.. అనంతరం సదరు యువకుడ్ని బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.

కరోనా బాధిత యువకుడ్ని అక్యూట్ ఐసీయూ నుంచి కాలి నడకన ఇన్ పేషెంట్ బ్లాక్ కు తీసుకొచ్చి ఆసుపత్రి ప్రధాన భవనం గ్రౌండ్ ఫ్లోర్ లోని హెల్ప్ డెస్క్ వద్ద వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. అనంతరం వారు ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో కరోనాను జయించిన యువకుడ్ని డిశ్చార్జ్ చేయగా.. మీడియాకు పదిన్నర గంటల ప్రాంతంలో ఆ విషయాన్ని గాంధీ అధికారులు వెల్లడించటం విశేషం.