Begin typing your search above and press return to search.

ఈఎంఐ వాయిదాపై ఒక్కో బ్యాంకు ఒక్కో తీరు?

By:  Tupaki Desk   |   1 April 2020 12:30 PM IST
ఈఎంఐ వాయిదాపై ఒక్కో బ్యాంకు ఒక్కో తీరు?
X
క్యాలెండర్లో ఏప్రిల్ నెల వచ్చేసింది. అన్ని నెలలు ఒకేలా ఉండవు. అన్ని ఫస్ట్ తారీఖులు ఒకేలా ఉండవన్న కొత్త విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసింది ఈ ఏప్రిల్ ఒకటో తేదీ. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఒకేలాంటి పద్దతులకు అలవాటైన ప్రజలకు.. తాజాగా వచ్చిన ఫస్ట్ తారీఖు సరికొత్త అనుభవాన్ని మాత్రమే కాదు.. మర్చిపోలేని ఎన్నో అంశాల్ని పరిచయమ్యేలా చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడిన కరోనా.. భారత్ మీద చూపించిన ప్రభావమెంతో. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటమే కాదు.. కేంద్రం పలు చర్యలు తీసుకుంది. ప్రభుత్వాలు ఇప్పటికే జీతాల్లో కోతల వాతను పెట్టేయగా.. ప్రైవేటు సంస్థలు సైతం ఇదే బాటను పట్టినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వాలే కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. ప్రైవేటు కంపెనీలు ఉత్తినే ఉంటాయా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు పలువురు.

గడిచిన కొన్ని సంవత్సరాలుగా మారిన విధానాలతో.. భారతీయులు తమ పొదుపు అలవాట్లను మార్చేసుకున్నారు. వచ్చే ఆదాయానికి దగ్గర దగ్గరగా ఉండేలా ఫైనాన్షియల్ కమిట్ మెంట్లను పెట్టుసుకున్న వేళ.. కరోనా లాంటి కఠిన పరిస్థితి ఏర్పడితే ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అయితే.. అన్ని రకాల లోన్లపై నెలవారీ వాయిదాలు అదేనండి ఈఎంఐల చెల్లింపును మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లుగా ఆర్ బీఐ చేసిన ప్రకటనకు తగ్గట్లు.. ప్రభుత్వ.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకలా స్పందిస్తే.. ప్రైవేటు బ్యాంకులు మరోలా వ్యవహరిస్తున్నాయి.

సామాన్యులు మొదలు కార్పొరేట్ల వరకూ అన్ని రకాల రుణాలకు సంబంధించిన వాయిదాలపై ఆర్ బీఐ విధించిన మారిటోరియంతో ప్రజలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అయితే.. ఆర్ బీఐ చెప్పిన మాటను పలు బ్యాంకులు సానుకూలంగా స్పందించాయి. దేశంలోనే అతి పెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి ఒకటి నుంచి మే 31 వరకూ అన్ని రకాల రుణాలపై ఈఎంఐలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్.. యూనియన్ బ్యాంకులు కూడా ఇదే తరహా నిర్ణయాన్ని ప్రకటించాయి.

ఈ బ్యాంకులతో పాటు ఇండియన్ బ్యాంక్.. కెనరా బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఓబీసీ.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.. సండికేట్ బ్యాంక్.. యూకో.. ఐడీబీఐ బ్యాంకులన్ని కూడా ఇదే తీరును అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. రిజర్వు బ్యాంక్ఆఫ్ ఇండియా ప్రకటన వెలువడిన రోజులోనే ఈ బ్యాంకులన్ని సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటే.. ప్రైవేటు బ్యాంకులైన హెచ్ డీఎఫ్ సీ.. యాక్సిస్.. ఐసీఐసీఐ లాంటి బ్యాంకులు మాత్రం.. ఆర్ బీఐ చేసిన సూచనల్ని పరిశీలిస్తున్నామని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. క్యాలెండర్లో తేదీలు మారిపోయి.. ఈఎంఐలు మీద పడే టైం దగ్గరకు వచ్చిన వేళ.. బ్యాంకులు త్వరగా నిర్ణయం తీసుకోవాలంటున్నారు.