Begin typing your search above and press return to search.

పబ్లిక్ ప్లేస్ లో తుమ్మినందుకు.. వెంట పడి మరీ చితక్కొట్టేశారు

By:  Tupaki Desk   |   20 March 2020 10:53 AM IST
పబ్లిక్ ప్లేస్ లో తుమ్మినందుకు.. వెంట పడి మరీ చితక్కొట్టేశారు
X
కరోనా భయం ఇప్పుడు ప్రజల్ని విపరీతంగా వేధిస్తోంది. దీని కారణంగా ఇప్పుడు కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. తాజా ఉదంతం ఈ కోవకు చెందినదే. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మాయదారి వైరస్.. తుమ్మినా.. దగ్గినా.. షేక్ హ్యాండ్ ఇచ్చినా సోకుతుందన్న నేపథ్యంలో.. ఎవరైనా కాస్త దగ్గినంతనే అనుమానంగా చూడటం ఎక్కువైంది. ఇక.. తుమ్మే సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో ఒక వ్యక్తి పబ్లిక్ ప్లేస్ లో తుమ్మాడు. ఆ సమయంలో చేతులు అడ్డు పెట్టుకోవటం కానీ.. మాస్క్ లాంటిది ధరించకపోవటంతో అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి కోపంతో.. తుమ్మిని వ్యక్తిని ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. బైక్ మీద వెళ్లిపోయాడు. దీంతో.. అతడ్ని వెంబడించిన సదరు వ్యక్తి.. తుమ్మిన వ్యక్తిని ఆపాడు. మాస్క్ పెట్టుకోకుండా ఎందుకు తుమ్మావని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా బదులిచ్చాడు.

దీంతో.. తుమ్మిన వ్యక్తి మీద పిడిగుద్దులు గుద్దాడా వ్యక్తి. రోడ్డు మీద చోటు చేసుకున్న ఈ గొడవతో ట్రాఫిక్ జాం అయింది. అక్కడి వారంతా గొడవకు కారణం తెలుసుకొని.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరోనాకు ముందు ఎవరైనా పబ్లిక్ ప్లేస్ లో తుమ్మితే ఇంత పెద్ద గొడవ జరుగుతుందని చెబితే నమ్మరు. కరోనా పుణ్యమా అని ఇలాంటి సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.