Begin typing your search above and press return to search.

పది రోజులు ఆగితే కరోనాతో అల్లకల్లోలమేనట

By:  Tupaki Desk   |   29 Jan 2020 7:26 AM GMT
పది రోజులు ఆగితే కరోనాతో అల్లకల్లోలమేనట
X
ఇప్పుడు ఎక్కడ విన్నా కరోనా మాటే. ఏ ఇద్దరు కలిసినా దీని గురించిన చర్చ తప్పనిసరిగా వచ్చే పరిస్థితి. అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రం గా ప్రభావితం చేస్తున్న ఈ వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. చైనాలోని వూహాన్ ఫ్రావిన్స్ లో మొదలైన ఈ వైరస్ అంతకంతకూ విస్తరించటమే కాదు.. చైనాలోని పన్నెండు నగరాలకు పాకింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చూస్తుండగానే పలు దేశాలకు ఈ వైరస్ ఎగుమతి అయ్యింది. చైనా నుంచి వివిధ దేశాలకు వెళ్లి వారి కారణంగా ఆయా దేశాల్లోకి ఈ వైరస్ వ్యాప్తిచెందటంతో అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

మంగళవారం ఒక్క రోజులోనే కరోనా వైరస్ కారణంగా పన్నెండు మంది చనిపోయారు. దీంతో.. ఈ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 132కు చేరింది. తాజా లెక్కల ప్రకారం మరో ఆరువేల మందికి ఈ వైరస్ సోకినట్లు గా గుర్తించారు. దీంతో.. వైరస్ సోకుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగి పోతోంది. వీరిలో 1239 మంది పరిస్థితి మరింత విషమం గా ఉంది.

ఈ వైరస్ కు జన్మస్థలి అయిన వుహాన్ లో ఇప్పటివరకూ 125 మంది మరణిస్తే.. మరో 3554 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న హుబెయ్ ఫ్రావిన్సులో 840 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నిపుణుల అంచనాల ప్రకారం మరో పది రోజుల్లో ఈ వైరస్ తీవ్రరూపం దాల్చటం తో మరణించే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. వైరస్ బారిన పడిన వారిని వీలైనంత త్వరగా గర్తించి.. వారిని దూరంగా ఉంచటమే ప్రస్తుతం వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయటానికి ఉన్న మార్గంగా చెబుతున్నారు.

రానున్న పది రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితే కొన సాగితే కరోనా వైరస్ కారణం గా అల్లకల్లోలం ఖాయమని.. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం తలకు మించిన భారంగా మారుతుందని చెబుతున్నారు. మరోవైపు ఈ వైరస్ ను నిలువరించేందుకు వీలుగా మందులు కనుగునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి.