Begin typing your search above and press return to search.

ఫోకస్: ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలనా?

By:  Tupaki Desk   |   16 April 2020 2:45 AM GMT
ఫోకస్: ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలనా?
X
ఆటోమొబైల్ పరిశ్రమ. ఇది ఎంత ఎదిగితే ఆ దేశపు వృద్ధి రేటు అంత వేగంగా సాగుతున్నట్టు లెక్క. అభివృద్ధికి సూచికగా ఆటోమొబైల్ పరిశ్రమను ఆర్థికవేత్తలు చెబుతుంటారు. భారత దేశంలో లాక్ డౌన్ వల్ల ఇప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది. లాక్ డౌన్ తో అందరి ఉద్యోగ - ఉపాధి పోవడంతో ఇక ఆటోమొబైల్ రంగం రెండేళ్ల వరకూ కోలుకునే పరిస్థితి ఉండదని నిపుణులు ఘంఠాపథంగా చెబుతున్నారు.

*అమెరికా అందుకే లాక్ డౌన్ విధించలేదు..

ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్రం అమెరికా. అక్కడ తయారీ - డిజైన్ పరిశ్రమ ఉంది. వాహన - ఇతర ఆటోమొబైల్ పరిశ్రమకు గమ్యస్థానంగా ఉంటూ వస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా విమానాల నుంచి ద్విచక్రవాహనాలు - ఫోన్లు - బాంబులు - ఇతర ఎలక్ట్రానిక్ - ఆటోమొబైల్ ఇతర వస్తువులన్నింటిని అమెరికా ఎగుమతి చేస్తుంటారు. అందుకే కరోనా ఇంత తీవ్రంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశ ఆర్థిక దృష్ట్యా లాక్ డౌన్ విధించకుండా ప్రజల ప్రాణాలను బలిపెట్టాడు.

*భారత్ లో ఆటోమొబైల్ కుదేలేనా?

లాక్ డౌన్ తో ఇఫ్పుడు దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైనట్టే కనిపిస్తోంది. వాహనాల క్రయ విక్రయాలు ఈ సంవత్సరం కొలుకునేలా లేవు. కార్లు - ద్విచక్ర వాహనాలు కొనేంత సాహసం జనాలు ఇప్పట్లో చేయరు. ప్రస్తుతం తిండి - నిత్యావసరాలు తప్పితే విలాసాలు తీర్చుకునేంత డబ్బు జనాల దగ్గర లేదు. ఇప్పుడు లాక్ డౌన్ ముగిసినా ఇప్పటికే కోల్పోయిన ఉద్యోగి - ఉపాధిని వెతుక్కొని నిలదొక్కుకునే సరికే ఏడాది పడుతుంది. అప్పుడు కానీ వాహనాల క్రయవిక్రయాలు మొదలయ్యే అవకాశాలు దేశంలో ఉండవు. దీంతో దేశంలో ఆటోమొబైల్ రంగం కోలుకోవాలంటే ఎంత లేదన్నా సంవత్సరం దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

*అన్ని రంగాలు కుదేలవడంతో ఆటోమొబైల్ కు కష్టం

అన్ని రంగాలు బాగా ఉండి.. జనాల దగ్గర డబ్బులు బాగా ఉంటేనే దేశంలో వాహనాల క్రయవిక్రయాలు సాగుతాయి. కార్లు - వాహనాలు ఇతర లగ్జరీ వస్తువులు కొంటారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ తో అంతా తలకిందులైంది. దీంతో జనాలు తమ ఈఎంఐలు - ఇంటి అప్పులు - ఇతర వాటిని తీర్చడానికే మొగ్గు చూపుతారు. తద్వారా కొత్తగా ఏ వాహనాలు ఇప్పట్లో కొనరు. ఈ పరిణామం ఆటోమొబైల్ రంగానికి తీరని శాపంగా మారనుంది.

*ఇప్పటికే ఉత్పత్తి ఆపుచేసిన మారుతీ.. ఇతర కంపెనీలు

బీఎస్ 6 టెక్నాలజీతో వాహనాలు దేశంలో ప్రవేశపెట్టడం.. వాటికి ధర అమాంతం పెరగడం.. ఇక ఆర్థిక మాంద్యం కారణంగా పోయిన త్రైమాసికంలోనే కార్ల కొనుగోలు లేక మారుతి ప్లాంట్లను మూసివేసింది. పులిమీద పుట్రలా ఇప్పుడు కరోనాతో మొత్తం కార్లు - ద్విచక్ర వాహనాల ఉత్పత్తే నిలిచిపోయింది. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడంతో ఉత్పత్తికి మరికొంత కాలం బ్రేక్ తప్పదు. ఇప్పుడు ఉత్పత్తి చేసిన వాహనాలు అమ్మితేనే మళ్లీ మొదలవుతుంది. కానీ జనాలు కొనే పరిస్థితి లేకపోవడంతో దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలుకావడం ఖాయంగా కనిపిస్తోంది..

*కోట్లమందికి ఉపాధి దూరం

ఆటోమొబైల్ పరిశ్రమపై ఆధారపడి కోట్ల మంది జీవిస్తున్నారు. షోరూంలలో పనిచేసే మెకానిక్ నుంచి ఉత్పత్తి చేసే కార్మికుల వరకూ ఈ పరిశ్రమపై ఆధారపడి ఉద్యోగ, ఉపాధి పొందే వారంతా ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే ఆస్కారం కనిపిస్తోంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో దేశంలో ఆటోమొబైల్ రంగం పెద్ద కుదుపునకు లోనుకావడం ఖాయమని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.