Begin typing your search above and press return to search.

కరోనాతో ఆగమాగమైపోతున్న చైనా..

By:  Tupaki Desk   |   24 Jan 2020 5:53 AM GMT
కరోనాతో ఆగమాగమైపోతున్న చైనా..
X
డ్రాగన్ దేశాన్ని ఎవరూ ఏమీ చేయలేరా? ఆ దేశానికి భయం అన్నది తెలీదా? ప్రపంచంలో మరే దేశం ఆ దేశాన్ని ఢీ కొనే ధైర్యం కూడా చేయలేరేమో? అన్నట్లుగా వ్యవహరించే చైనా.. ఈ రోజున చిగురుటాకులా వణుకుతోంది. కర్కస పాలకులతో ప్రజల హక్కుల్ని.. వారి అభిప్రాయాల్ని బయట ప్రపంచానికి తెలీకుండా చేసే చైనాను ఇప్పుడో వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భయంతో ఆగమాగం చేస్తోంది. కిల్లర్ కరోనా వైరస్ చైనాలో అంతకంతకూ వ్యాపిస్తోంది.

కొత్త సంవత్సరం వేడుకుల వేళ.. బయటకు వచ్చిన ఈ వైరస్ ఇప్పుడా దేశ ప్రజల్నే కాదు ప్రభుత్వాల్ని వణికిస్తోంది. వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ.. చైనా ప్రభుత్వం అసాధారణ నిర్ణయాన్ని తీసుకుంటోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి పాతికమంది చనిపోవటం.. మరో 830 మందికి వైరస్ సోకిన నేపథ్యంలో.. మరింతమందిలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా.. ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయేలా నిర్ణయాలు తీసుకుంటోంది.

కరోనా వైరస్ కారణంగా మరణించిన పాతిక మందిలో 24 మంది మధ్య హుబీకి చెందిన వారు కాగా మరొకరు హెబీకి చెందిన వారు. హెబీ ప్రాంతం చైనా రాజధాని బీజింగ్ కు సరిహద్దుల్లో ఉండటంతో రాజధానిలోకి కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 177 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. చైనాలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చైనా రాజధాని బీజింగ్ లోనూ కేసులు పెరుగుతున్నాయి. చైనాతో పాటు దక్షిణ కొరియా.. తైవాన్.. జపాన్.. అమెరికాలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు వీలుగా 70 లక్షల మంది ప్రజల్ని ఎక్కడికక్కడ నిలిపివేస్తూ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచ ఆరోగ్య చరిత్రలో తొలిసారి ఇంత భారీ సంఖ్యలో ప్రజల్ని.. ఆరోగ్య కారణాలతో ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండటం తప్పించి.. మరో ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేశారు. చైనాలో వైరస్ వ్యాప్తి చెందుతున్న వ్యుహన్ గాంగ్ లో ప్రజా రవాణను అధికారులు నిలిపివేశారు. అయితే.. వారు ప్రయాణం కోసం కానీ ఇతర కారణాల కోసం కానీ ఎక్కడికి వెళ్లొద్దన్న పరిమితులు విధించలేదని చెబుతున్నారు.

శనివారం నుంచి చైనా న్యూఇయర్ వేడుకలు స్టార్ట్ అవుతాయి. ఇలాంటివేళ.. దేశంలోని వివిధ ప్రాంతాల వారు తమ స్వస్థలాలకు పెద్ద ఎత్తున ప్రయాణమవుతుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణాలు భారీగా సాగితే.. వైరస్ వ్యాప్తి మరింత వేగవంతమవుతుందని భయపడుతున్నారు. ఈ డేంజరస్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఏమైనా.. కరోనా వైరస్ కారణంగా డ్రాగన్ దేశం దడదడలాడిపోతోందని చెప్పక తప్పదు.