Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కట్ డ్రాయర్ కొనేందుకు అన్ని కిలోమీటర్లు తిరిగాడట

By:  Tupaki Desk   |   23 April 2020 12:45 PM IST
హైదరాబాద్ లో కట్ డ్రాయర్ కొనేందుకు అన్ని కిలోమీటర్లు తిరిగాడట
X
కరోనా వేళ లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు పోలీసుల కళ్లుగప్పి రోడ్ల మీద తిరుగుతున్నారు. లాక్ డౌన్ విధించి నెల రోజులు అవుతున్నా.. వైరస్ తీవ్రతను అర్థం చేసుకునోనట్లుగా పలువురు ప్రజలు రోడ్ల మీదకు వస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏ మాత్రం బాధ్యత లేకుండా రోడ్ల మీదకు రావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. సరైన కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వారి విషయంలో పోలీసులు కొంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నా.. చాలా మందికి అదేమీ పట్టట్లేదన్న మాట వినిపిస్తోంది.

తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా షాకింగ్ నిజాలు కొన్ని బయటకు వచ్చాయి. భారీ ఎత్తున వాహనదారులు రోడ్ల మీదకు రావటంతో.. కూకట్ పల్లి వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడిన దుస్థితి. ప్రజలు ఏయే కారణాల మీద బయటకు వస్తున్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీసిన వేళ.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

లాక్ డౌన్ వేళ.. ఇంట్లో ఉండటంతో బోర్ కొట్టిన పలువురు.. ఏదో ఒక సిల్లీ కారణాన్ని చూపిస్తూ రోడ్ల మీదకు వచ్చిన వైనం బయటకు వచ్చింది. ఒక యువకుడు తనకు కట్ డ్రాయర్ అవసరం ఉందని.. అందుకే ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించిన వైనాన్ని గుర్తించారు. నిత్యవసర వస్తువులు.. అత్యవసర సామాన్లు మాత్రమే లభించేలా షాపులు తెరిచి ఉంచుతున్నా.. కట్ డ్రాయర్ కోసమని బయటకు వచ్చినట్లుగా చెప్పిన సదరు వ్యక్తికి షాకిచ్చారు పోలీసులు. అతడి వాహనాన్ని సీజ్ చేశారు.

మరో వ్యక్తి.. లీటరు పెట్రోల్ కోసం ఏకంగా ఆరేడు కిలోమీటర్లు ప్రయాణిస్తున్న వైనాన్ని గుర్తించారు. రోడ్ల మీదకు వస్తున్న వాహనాల్లో దాదాపు నలభై శాతం వరకూ అవసరం లేనివేనని.. మరో 30 శాతం ఏదో కారణం చెప్పి.. పాసులు చూపించి రోడ్ల మీద తిరుగుతున్న వైనాన్ని పోలీసులు గుర్తించారు. ఇలాంటివారిపై కేసులు నమోదు చేసి.. వాహనాల్ని సీజ్ చేస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు సిల్లీ కారణాలతో రోడ్ల మీదకు వచ్చి తిప్పలు తెచ్చుకోవటమా? అన్న భావన కలుగక మానదు.