Begin typing your search above and press return to search.

కేసీఆర్ తీరే వేరబ్బా.. తెర మీదకు కొత్త కథానాయకులు

By:  Tupaki Desk   |   23 April 2020 9:30 AM IST
కేసీఆర్ తీరే వేరబ్బా.. తెర మీదకు కొత్త కథానాయకులు
X
ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సంక్షోభం చోటు చేసుకున్నా.. అనుకోని విపత్తు విరుచుకుపడినప్పుడు ముందుగా చేరుకునేది పోలీసులే అయినా.. ఆ వెంటనే దూసుకొచ్చేది మాత్రం రాజకీయ గణమే. అందుకు భిన్నమైన పరిస్థితిని తీసుకొచ్చింది కరోనా. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కనిపించని మహమ్మారి పుణ్యమా అని ఇప్పటికే పలు అంశాల్లో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. తాజాగా సూర్యపేట ఉదంతాన్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మరే ప్రాంతంలో లేనట్లుగా సూర్యాపేటలో కరోనా పాజిటివ్ కేసులు విరుచుకుపడుతున్నాయి. మంగళవారం తెలంగాణలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదై సూర్యాపేట వార్తల్లో నిలవటమే కాదు.. అందరిని అవాక్కు అయ్యేలా చేసింది. దీంతో.. రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి సూర్యాపేటలో కరోనాకు చెక్ పెట్టేందుకు భారీ ఫార్ములాను సిద్ధం చేశారని చెబుతున్నారు. సాధారణంగా ఒక ప్రాంతంలో తీవ్రమైన పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు పాలకులు హుటాహుటిన సదరు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు ధైర్యాన్ని చెప్పటం మామూలే.

దీనికి భిన్నమైన సీన్ బుధవారం సూర్యాపేటలో చోటు చేసుకుంది. తెలంగాణ లో అత్యధికంగా కేసులు నమోదవుతున్న సూర్యాపేట జిల్లాలో రాజకీయ అధినేతలు కాకుండా రాష్ట్ర డీజీపీ.. సీఎస్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పర్యటించారు. కరోనా ఎపిసోడ్ లో ఆ మధ్యన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వైరస్ మహమ్మారికి చెక్ చెప్పేందుకు ఏ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి కథానాయకులుగా మారాలని.. పోలీసులకు అండగా నిలవాలన్న మార్గదర్శనం చేశారు.

కరోనా కాకుండా విడి సమయాల్లో సూర్యాపేట లాంటి ఉదంతాలు చోటు చేసుకుంటే అయితే ముఖ్యమంత్రో.. లేదంటే ఆయన తర్వాతి స్థానంలో ఉన్న కేటీఆర్ పర్యటించేవారు. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ నేతల్ని రంగంలోకి దింపకుండా అత్యున్నత స్థాయి అధికారుల టీంను సూర్యాపేట కు పంపటం చూస్తే.. తెర మీదకు సరికొత్త కథానాయకుల్ని తీసుకొచ్చారని చెప్పక తప్పదు.

కరోనా భయంలో ఇప్పటికే తెలంగాణ అధికారపక్షానికి చెందిన నేతలు పరిమితంగానే బయటకు కనిపిస్తున్నారు. చాలా కొద్దిమంది మినహా మిగిలిన నేతలు ఇళ్లల్లోనూ.. ఫాంహౌస్ లకు పరిమితమైనట్లుగా తెలుస్తోంది. ఇలాంటివేళలో సూర్యాపేటలో పెరిగిపోతున్న కేసుల్ని తగ్గించే భారీ బాధ్యతను అధికారుల మీద పెట్టటం చూస్తే.. ఇలాంటివి కేసీఆర్ కు మాత్రమే చెల్లుతాయని చెప్పక తప్పదు. మరి.. సారు వారి సరికొత్త కథానాయకులు సూర్యాపేటలో కరోనాను ఏమేరకు కట్టడి చేస్తారన్నది కాలమే నిర్ణయించాలి.