Begin typing your search above and press return to search.

తెలంగాణలో కరోనా విజృంభణ.. తాజాగా రెండు కేసులు

By:  Tupaki Desk   |   27 March 2020 8:50 AM GMT
తెలంగాణలో కరోనా విజృంభణ.. తాజాగా రెండు కేసులు
X
కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నా కరోనా మాత్రం విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో రెండు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిని వైద్య అధికారులు ధృవీకరించారు. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 47కి చేరాయి. నిరంతరం కరోనా వ్యాప్తిపై పర్యవేక్షిస్తున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో ఇప్పటివరకు 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం కరోనా వైరస్‌ వ్యాప్తిపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని మరోసారి గుర్తుచేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 వైద్య కళాశాలలు ఉండగా వాటిని కరోనా నివారణ కోసం వినియోగిస్తామని తెలిపారు. దీంతోపాటు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఉన్న పరికరాలతో పాటు వైద్య సిబ్బంది సహకారం కూడా అందిస్తామని ముందుకువచ్చారని.. వారి సేవలు కూడా తీసుకుంటామని చెప్పారు. మొదటి విడతలో ప్రభుత్వ ఆస్పత్రులు, రెండో విడతలో ప్రైవేట్‌ కళాశాలలను ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా నివారణ కోసం 10 వేల పడకలు, 700 ఐసీయూ, 170 వెంటిలెటర్స్‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటు లో ఉంచుతామని వెల్లడించారు.