Begin typing your search above and press return to search.

కరోనా వేళ దేశ ప్రజలకు కేంద్రం విధించిన 15 నిబంధనలు ఇవే

By:  Tupaki Desk   |   17 March 2020 10:00 AM IST
కరోనా వేళ దేశ ప్రజలకు కేంద్రం విధించిన 15 నిబంధనలు ఇవే
X
ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా కారణంగా పలు దేశాలు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటివేళ.. అప్రమత్తతకు మించిన ఆయుధం మరొకటి లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా కేంద్రం రంగంలోకి దిగింది. కఠిన నిబంధనల్ని తెర మీదకు తెచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ రూల్స్ ను దేశ ప్రజలంతా తప్పని సరిగా పాటించాలని కోరింది.

మార్చి 31 వరకూ చెల్లుబాటు అయ్యేలా తీసుకొచ్చిన ఈ నిబంధనల్ని.. 15 కమాండ్ మెంట్స్ గా అభివర్ణించక తప్పదు. ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనల్ని మార్చి 31 నాటి పరిస్థితుల్ని సమీక్షించి తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

1. మార్చి 31 వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్ని మూసివేయాలి.
2. అత్యవసరమైతే తప్పించి సమావేశాల్ని నిర్వహించకూడదు. వీడియోకాన్ఫరెన్స్ లు మంచిది
3. అన్ని రెస్టారెంట్లు ప్రోటోకాల్ పాటించాలి. టేబుళ్లు.. కుర్చీలు తరచూ శుభ్రం చేయాలి. టేబుల్ కు టేబుల్ కు మధ్య కనీసం మీటరు దూరం తప్పనిసరి.
4. షేక్ హ్యాండ్.. కౌగిలింతల్ని పక్కన పెట్టేయాలి. పరిశుభ్రత తప్పని సరిగా పాటించాలి
5. ఆన్ లైన్ వస్తువుల డెలివరీ చేసే వారికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలి
6. ఎవరికి వారు వారి వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని అవసరానికి తగినట్లుగా అధికారులకు అందించాలి
7. పరీక్షల వాయిదాకు ప్రయత్నించాలి. తప్పనిసరైతే.. పరీక్షలు రాసే విద్యార్థికి మరో విద్యార్థికి మధ్య మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
8. మత సంబంధిత కార్యక్రమాలు.. సభల్లో పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మత పెద్దలకు నచ్చజెప్పి అలాంటివి చోటు చేసుకోకకుండా చూసుకోవాలి.
9. ప్రజలకు అత్యవసరమైన పండ్లు.. కూరగాయల మార్కెట్లు.. బస్టాండ్.. రైల్వేస్టేషన్లు.. పోస్టాఫీసులు లాంటిచోట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన హెచ్చరికల్ని ప్రముఖంగా ప్రదర్శించాలి.
10. వీలైనంత వరకూ ఉద్యోగులు ఇళ్ల నుంచి పని చేసేలా కంపెనీలు ఏర్పాట్లు చేయాలి
11. పెళ్లిళ్లు.. శుభకార్యాలకు సంబంధించి ఇప్పటికే నిర్ణయించి ఉంటే పరిమితంగా నిర్వహించేలా చేసుకోవాలి.
12. క్రీడా కార్యక్రమాల్ని.. పోటీల్ని వాయిదా వేసేలా స్థానిక అధికారులకు చెప్పాలి.
13. వ్యాపార సంస్థలు తమ వినియోగదారుల మధ్య దూరం కనీసం మీటరు ఉండేలా చూసుకోవాలి. రద్దీ సమయాల్లో ఒకరికి ఒకరు దగ్గరగా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
14. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స చేస్తున్న ఆసుపత్రుల్లో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి. ఆసుపత్రుల్లో రోగుల్ని చూసేందుకు వారి కుటుంబ సభ్యుల్ని.. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు.
15. అనవసరమైన ప్రయాణాల్ని రద్దు చేసుకోవాలి. చుట్టు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.