Begin typing your search above and press return to search.

నగరంలో కరోనా వైరస్ కలకలం.. వ్యాధి లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో యువకుడు

By:  Tupaki Desk   |   30 Jan 2020 11:42 PM IST
నగరంలో కరోనా వైరస్ కలకలం.. వ్యాధి లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో యువకుడు
X
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి ఇది. చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన ఈ వైరస్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తుండటం కలవరపెడుతోంది. చైనాలో అయితే ఈ వైరస్ బాగా విస్తరించడంతో ఇప్పటికే వందలాది మంది మరణించారు. వేలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. కాగా తాజాగా హైదరాబాద్ నగరంలో ఈ వ్యాధి లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో ఓ కేసు ఫైల్ కావడంతో నగర జనం ఉలిక్కిపడ్డారు.

విమానాశ్రయాల్లో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ముమ్మర ఏర్పాట్లు చేసి విదేశాల నుంచి వస్తున్న ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేస్తోంది. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరమే బయటకు పంపిస్తోంది. అయినప్పటికీ కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్లు కొద్దిసేపటి క్రితం వైద్యులు గుర్తించారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు మియాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్‌ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరడం నగరాన్ని వణికిస్తోంది.

ఈ వ్యక్తి ఇటీవలే చైనా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం గాంధీలో అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కరోనా వైరస్ కి సంబంధించిన వ్యాధి లక్షణాలు టెస్ట్ చేసే అన్ని పరికరాలు గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసింది ఆరోగ్యశాఖ. ఈ మేరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గాంధీ ఆసుపత్రిలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు.