Begin typing your search above and press return to search.

కరోనా కల్లోలం..అమెరికా దుస్థితి ఇంకెక్కడా కనిపించదేమో!

By:  Tupaki Desk   |   5 April 2020 11:30 PM GMT
కరోనా కల్లోలం..అమెరికా దుస్థితి ఇంకెక్కడా కనిపించదేమో!
X
ప్రాణాంతక వైరస్ కరోనాతో ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు వణికిపోతున్నాయి. అసలు కరోనా సోకని, కరోనా పేరు వింటే భయపడని దేశమంటూ ఇప్పుడు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇక ప్రపంచంలో ఏ మూల,ఏ దేశంలో విపత్తు ఎదురైనా... అండగా తానున్నానంటూ రంగంలోకి దిగే అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందనే చెప్పాలి. అసలు కరోనాతో అత్యంత ఎక్కువ నష్టం నమోదైన దేశం అమెరికా అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే... కరోనా పుట్టిన చైనాలో కంటే కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమెరికాలోనే ఎక్కువ. మరణాల సంఖ్య కూడా అమెరికాలోనే అధికం. ఇంకా చెప్పాలంటే... అమెరికా వాణిజ్య నగరం న్యూయార్క్ లో నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు పరిశీలిస్తే... కరోనాతో అమెరికాకు జరిగినంత నష్టం మరే దేశానికి కూడా జరగలేదనే చెప్పదు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ, దాని ప్రభావంతో జరుగుతున్న నష్టం, కరోనాతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఫలితంగా మారిపోతున్న మానవ సంబంధాలు, తెగిపోతున్న భవ బంధాలు... ఇలా ప్రతి అంశం కూడా ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. ఒక ఫ్యామిలీలో ఎవరికైనా కరోనా సోకిందంటే... ఆ వ్యక్తిని సదరు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడమే తప్పించి... సదరు వ్యక్తి చికిత్స తర్వాత కోలుకుని ఇంటికి తిరిగివస్తాడన్న నమ్మకం పోయింది. కరోనా సోకి ఇంటి నుంచి ఆసుపత్రి తరలించారంటే...అటు నుంచి అటే స్మశనానికి వెళ్లినట్టేనన్న వాదన కూడా బాగా పెరిగిపోయింది. అంతేకాకుండా తన చివరి క్షనాల్లో కుటుంబ సభ్యులతో గడపాలన్న బాధితుల కడసారి కోరిక కూడా దుర్లభంగానే మారిపోయిందని చెప్పక తప్పదు. ఎందుకంటే... కరోనా వార్డులోకి రోగిని తప్పించి ఇతరులకు ప్రవేశం లేదు కదా.

ఇక తమ కుటుంబంలో ఎవరైనా కరోనా బాధితులుగా మారితే... వారిని ఆసుపత్రుల్లో చేరుస్తున్న కుటుంబ సభ్యులు... ఇక వారిపై ఆశలు వదిలేసుకుంటున్నారు. అంతేకాకుండా కరోనాతో మరణిస్తున్న తమ వారి భౌతిక కాయాలను స్వాధీనం చేసుకునేందుకు ముందుకు వస్తున్న వారు కనిపించడం లేదు. అంటే.. కరోనా సోకిందంటే... తమ కుటుంబంలోని వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చేంతవరకే తమ పని అని, చనిపోయాక.. సదరు కుటుంబ సభ్యుడి గురించి అస్సలు పట్టించుకోని దారుణ పరిస్థితి అమెరికాలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే... కుటుంబ సభ్యుడు చనిపోయినా... తాము బతికుండాలంటే... సదరు మృతుడి డెడ్ బాడీని స్వాధీనం చేసుకోకపోవడమొక్కటే మార్గమన్న వాదన కూడా అమెరికాలో పెరిగిపోయింది. మొత్తంగా అమెరికాలో అంతంత మాత్రంగానే ఉన్న మానవ సంబంధాలను కరోనా వైరస్ పూర్తిగా చంపేసిందన్న మాట. ఈ తరహాలో కరోనాతో భారీ నష్టాన్ని, పెను ప్రభావాన్ని అనుభవిస్తున్న దేశాల్లో అమెరికానే అగ్రస్థానంలో ఉందని చెప్పక తప్పదు. ఇప్పుడే ఇలా ఉంటే.. కరోనా అంతమొందేనాటికి పరిస్థితులు ఇంకెలా మారతాయోనన్న భయాందోళనలు రేకెత్తుతున్నాయి.