Begin typing your search above and press return to search.

నయా ట్రెండ్: డబుల్ మాస్క్ తో కరోనాకు దూరం!

By:  Tupaki Desk   |   26 April 2021 5:30 PM GMT
నయా ట్రెండ్: డబుల్ మాస్క్ తో కరోనాకు దూరం!
X
కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొదటి దశ కంటే రెండో దశలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఆక్సిజన్ అందక మరణాలు అంతకంతకూ సంభవిస్తున్నాయి. వైరస్ నిరంతరం మార్పులు చెందుతోంది. ఫలితంగా కొత్త లక్షణాలు ఏర్పడుతున్నాయి. ఏడాది కాలంగా వైరస్ విజృంభణ నేపథ్యంలో మాస్క్ ధరించడం మనిషి జీవితంలో భాగం అయింది.

మాస్క్ ధరించడం అలవాటుగా మారిపోయింది. కొవిడ్ రెండో దశలో కేవలం ఒక్కమాస్క్ తో కట్టడి చేయడం కష్టం. మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నందున్న కేవలం ఒక్క వస్త్రం పని చేయదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రెండు మాస్కులు ధరించడం వల్ల మహమ్మారి బారిన పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

డబుల్ మాస్క్ లపై పరిశోధనలు చేసిన అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ రెండు మాస్కులను ధరించడం ఉత్తమం అని తేల్చారు. వైరస్ రెండో దశలో తొలుత సర్జికల్ మాస్క్ ధరించి... ఆ పైన వస్త్రంతో తయారు చేసిన మరో మాస్కును ధరించాలని సూచించారు. మొదటి మాస్కు ద్వారా ఉన్న ఖాళీలను రెండో మాస్కు కప్పివేస్తుంది. ఇలా ముఖాన్ని మొత్తం కప్పివేస్తే కొవిడ్ నుంచి దూరంగా ఉండొచ్చని చెప్పారు.

పరిశోధనలకే పరిమితం కాకుండా డబుల్ మాస్క్ పై ప్రచారం చేస్తున్నారు. ఆయనే స్వయంగా రెండు మాస్కులు ధరించి.. ఆ ఫొటోని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇకపై అందరూ రెండు మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ వేళ రెండు మాస్కులు వాడడం నయా ట్రెండ్ తో పాటు... ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.