Begin typing your search above and press return to search.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం..1.50లక్షలకు పైగా మృతి

By:  Tupaki Desk   |   18 April 2020 9:10 AM GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం..1.50లక్షలకు పైగా మృతి
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య, మరణాలు ఏమాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా మరణాల్లో రికార్డు నమోదైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1,54,145కు చేరింది. లక్షన్నర మరణాలు ఒక వైరస్ కారణంగా నమోదుకావడం ఒక రికార్డ్ గా అభివర్ణిస్తున్నారు. ఇంతటి విషాదం ఎప్పుడూ జరగలేదంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22.48లక్షలు దాటింది.

అన్ని దేశాల్లోనూ కరోనా కారణంగా మరణాలు బీభత్సంగా కొనసాగుతున్నాయి. ఏమాత్రం ప్రభావం తగ్గకపోవడంతో లాక్ డౌన్ పొడిగింపునకే అన్ని దేశాలు మొగ్గుచూపుతున్నాయి. మరణాల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

అమెరికాలో నిన్న ఒక్కరోజులో 4591మంది మరణించడం కలకలం రేపింది. గడిచిన 12 గంటలల్లోనే 2535మంది మరణించారు. కొత్తగా 32165మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు అమెరికాలో 7.09 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా.. 37154మంది మరణించారు. మే 15వరకు లాక్ డౌన్ ను అమెరికాలో పొడిగించారు.

ఫ్రాన్స్ లో ఒకే రోజు 761మంది మరణించారు. 1909కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.47లక్షలు దాటేసింది. కరోనాతో ఫ్రాన్స్ లో 18681మంది మరణించారు.

స్పెయిన్ లో నిన్న ఒక్కరోజే 687మంది మరణించారు. కొత్తగా 5891 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1.90లక్షలు దాటింది.

ఇటలీలో ఒక్కరోజులో 575మంది చనిపోయారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 23వేలకు చేరువైంది. కొత్తగా 3493 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1.72 లక్షలు దాటింది.

ఇరాన్ లో కరోనాతో గురువారం 89మంది మరణించారు. మొత్తం 4950మంది ఇప్పటివరకు చనిపోయారు. టర్కీలో 4350 కరోనా కేసులు 1769 మరణాలు చోటుచేసుకున్నాయి.

యూరప్ దేశాల్లోని బెల్జియం - పోర్చుగల్ - నెదర్లాండ్ - స్విట్లర్లాండ్ లోనూ 20వేలకు పైగా కేసులు వందల్లో మరణాలు చోటుచేసుకున్నాయి. రష్యాలో 41మంది - కెనడాలో 115మంది చనిపోయారు.

*భారతదేశంలో..

ఇక భారత దేశంలో ఇప్పటివరకు 14425 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 488మంది చనిపోయారు. 2045మంది కోలుకొని బయట పడ్డారు.

*తెలుగు రాష్ట్రాల్లో..

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య శనివారం మధ్యాహ్నానికి 766కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 18మంది మరణించారు.186మంది చికిత్స పొంది కోలుకున్నారు.

ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 603కి చేరింది. కొత్తగా నమోదైన కేసులో 18 కేసులు కేవలం కృష్ణా జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. అలాగే కర్నూల్ లో 5 - నెల్లూరు లో 3 - ప్రకాశం - తూర్పూ గోదావరి జిల్లాలో రెండు - ప.గో లో ఒక కేసు నమోదు అయ్యింది. ఇక రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 15 కు చేరింది.