Begin typing your search above and press return to search.

దేశంలో కరోనా కరెంట్ స్టేటస్..టెన్షన్ పుట్టించే కొత్త లెక్క

By:  Tupaki Desk   |   16 March 2020 10:04 AM GMT
దేశంలో కరోనా కరెంట్ స్టేటస్..టెన్షన్ పుట్టించే కొత్త లెక్క
X
అందరూ కరోనా గురించి మాట్లాడేవారే. అధికారిక సమాచారాన్ని ఉంటకిస్తూ సమాచారం అందించే వారి కంటే వాట్సాప్ లు.. సోషల్ మీడియా పోస్టుల్ని పార్వర్డ్ చేసే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇప్పటికిప్పుడు దేశంలో కరోనా కరెంట్ స్టేటస్ ఎమిటి? ఎలాంటి పరిస్థితి ఉంది? అన్న విషయాల్లోకి వెళితే.. కొత్త అంశాలు కనిపిస్తాయి. కరోనా కేసులు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 110కి చేరగా వీరిలో భారతీయులు 93 మంది కాగా.. విదేశీయులు 16 మంది ఉన్నారు. మరొకరికి సంబంధించిన వివరాలు బయటకు రావటం లేదు. ఒకరి పరిస్థితి క్రిటికల్ గా ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఐసీయూ లో చేర్చి చికిత్స చేస్తున్నట్లుగా ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

దేశంలో కన్ఫర్మ్ చేసిన 110 కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఈ రాష్ట్రం లో మొత్తం 33 మంది కరోనా తో చికిత్స పొందుతున్నారు. తర్వాతి స్థానంలో కేరళ నిలిచింది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ కన్ఫర్మ్ చేసిన కేసులు 22. హర్యానాలో 14 కేసులు.. ఉత్తరప్రదేశ్ లో 12 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో ఏడు కేసులు.. కర్ణాటకలో ఆరు కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ లో నాలుగు.. తెలంగాణలో మూడు కేసులు.. లద్ధాఖ్ లో మూడు.. జమ్ముకశ్మీర్ లో రెండు.. తమిళనాడు.. ఏపీ.. ఉత్తరాఖండ్.. లలో ఒక్కో పాజిటివ్ గా తేలాయి.

మొత్తం కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన కేసులు 82 అయితే.. వారి నుంచి స్థానికులకు సోకిన కేసులు 28గా చెబుతున్నారు. డిసెంబరు చివర్లో చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్.. జనవరిలో మన దేశంలో కనిపించగా.. మార్చి వరకూ దాని ప్రభావం మన మీద లేదనే చెప్పాలి.

మార్చి రెండున ఒక కేసు పాజిటివ్ గా తేలగా.. మార్చి నాలుగున ఏకంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కాలంలో కొత్త కేసుల నమోదు తక్కువే ఉన్నా.. మార్చి 11న ఒక్కసారిగా 19 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి రోజు కొత్త కేసులు నమోదు కావటం పెరుగుతూ వచ్చింది. మార్చి 12న ఐదు.. మార్చి 13న ఏడు.. మార్చి 14న 12.. మార్చి 15న పదిహేను మందిని ఆసుపత్రి లో చేర్చి చికిత్స చేస్తున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు.. ప్రస్తుతం కరోనా ప్రభావం రానున్న వారంలో మరింత పెరిగే వీలుందని చెబుతున్నారు.

తొలుత కరోనా సోకిన వారి ఉదంతాలు బయటపడుతుండగా.. వారి తో వేరే వారికి సోకే ప్రమాదం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కేసుల నమోదు ఎంత తక్కువగా ఉంటే.. కరోనాను అంతగా కట్టడి చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల తో పోలిస్తే.. దక్షిణాదిలో ఏపీ.. తమిళనాడుల్లో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలో పరిస్థితి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ఇప్పటికే పాజిటివ్ గా తేలిన వారి నుంచి ఎంత తక్కువ మందికి వ్యాపిస్తుందన్న దాని మీద రానున్న రోజుల పరిస్థితి ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు.