Begin typing your search above and press return to search.

రాసి పెట్టుకో సాంబ..హైదరాబాద్ లో రోజుకు అన్నికేసులు కామన్!

By:  Tupaki Desk   |   16 May 2020 4:05 AM GMT
రాసి పెట్టుకో సాంబ..హైదరాబాద్ లో రోజుకు అన్నికేసులు కామన్!
X
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే తెలంగాణలో మాయదారి రోగానికి చెక్ పెట్టటం సాధ్యమయ్యేదన్న విషయాన్ని మాటల్లోనే కాదు.. చేతల్లోనూ సీఎం కేసీఆర్ చేసి చూపించారని చెబుతున్నారు టీఆర్ ఎస్ నేతలు. వారి మాటలకు తగ్గట్లే.. రోజువారీగా ప్రభుత్వం విడుదల చేసే హెల్త్ బులిటెన్ ను చూస్తే.. హైదరాబాద్ మహానగరం.. వలసలు తప్పించి.. మిగిలిన జిల్లాల్లో మాయదారి రోగానికి సంబంధించిన కొత్త కేసులు జీరోగా దర్శనమిస్తున్నాయి.

గడిచిన కొద్దిరోజులుగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. శుక్రవారం విషయానికి వస్తే.. 40 కేసులు పాజిటివ్ గా తేలితే.. అందులో 33 పాజిటివ్ లు జీహెచ్ ఎంసీ పరిధిలోనివే. మాయదారి రోగాన్ని జిల్లాల్లో కంట్రోల్ చేయగలిగిన కేసీఆర్.. హైదరాబాద్ లో మాత్రం ఎందుకు సాధ్యం కావట్లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. జిల్లాల్లోఅనుసరించిన ఫార్ములా మహానగరంలో ఎందుకు వర్క్ వుట్ కావట్లేదన్న విషయంలోకి వెళితే.. జనసాంద్రత ఎక్కువగా ఉండటం.. 1.3 కోట్లకు పైగా ఉన్న జనాభా.. భారీగా ఉన్న విస్తీర్ణంలో ఏ మూలన ఎప్పుడు ఏ కేసు నమోదు అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొన్ని రోజుల పాటు.. హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు కామన్ అని.. రోజుకు ఎంత లేదన్నా.. పాతిక నుంచి ముప్ఫై కేసులు పక్కాగా నమోదవుతాయని చెబుతున్నారు. ఈ విషయంలో మరో మాటకు అవకాశం లేదంటున్నారు. చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో సంతోషించే అంశం ఏమైనా ఉందంటే.. అది మరణాల సంఖ్య తక్కువగా ఉండటం. జాతీయ సగటుతో పోల్చినా తెలంగాణలో ఇది తక్కువగా ఉంది.

జిల్లాల్లో మాయదారి రోగానికి మందు వేసిన కేసీఆర్ భాగ్యనగరి విషయంలో మాత్రం ఆయన ఎత్తులు వర్క్ వుట్ కావట్లేదు. జిల్లాల్లో జనసాంద్రతతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో ఎక్కువగా ఉండటంతో.. అనుకున్నట్లుగా కేసులు కంట్రోల్ కావట్లేదు. దీనికి తోడు గుట్టుచప్పుడు కాకుండా వచ్చేస్తున్న ప్రజలతోనూ ప్రభుత్వానికి సమస్యగా మారిందని చెబుతున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వారి కారణంగానూ రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.