Begin typing your search above and press return to search.

కేటీఆర్‌కు ప‌ట్టాభిషేకం.. కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారా?

By:  Tupaki Desk   |   17 Jan 2021 7:00 AM IST
కేటీఆర్‌కు ప‌ట్టాభిషేకం.. కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారా?
X
తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్.. త‌న కుమారుడు.. రాజ‌కీయ వార‌సుడు.. క‌ల్వ‌కుంట్ర తార‌క రామారావు(కేటీఆర్‌)కు ముఖ్య‌మంత్రి పీఠం అందించ‌నున్నార‌నే వార్త‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. అంతేకాదు.. వ‌చ్చే నెల 18న ప‌ట్టాభిషేకానికి సంబంధించిన ముహూర్తం కూడా ఖ‌రారు అయింద‌ని వ‌స్తున్న వార్త‌లు.. వినిపిస్తున్న వ్యాఖ్య‌లు.. రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించాయి. దీంతో నిజంగానే కేటీఆర్‌కు ప‌ట్టం క‌ట్టేందుకు కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? అని రాజ‌కీయ నేత‌లు ఆరా తీయడం ప్రారంభించారు.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కేటీఆర్‌.. అన‌తి కాలంలో దీటైన నాయ‌కుడిగా ఎదిగారు. తెలంగాణ వాదాన్ని వినిపించ‌డంలోను, ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల తూటాలు పేల్చ‌డంలోనూ కేసీఆర్‌నే మించిపోయార‌నే రికార్డు సొంతం చేసుకున్నారు. ఉద్య‌మంతోపాటు.. తెలంగాణ‌లో జ‌రిగిన తొలి అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న దూకుడుగా పార్టీకోసం ప‌నిచేశారు. ఇక‌, సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో 2009 ఎన్నిక‌ల నుంచి కేటీఆర్ త‌న‌దైన దూకుడు చూపిస్తున్నారు. వ‌రుస విజ‌యాల‌తో పార్టీకి ఐకాన్‌గా మారారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మే కాకుండా.. రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్ లోను.. త‌న‌దైన ముద్ర వేశారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ స‌హా.. హైద‌రాబాద్‌లోని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కేటీఆర్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇక‌, 2018 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీఆర్ ఎస్ అదినేత, సీఎం కేసీఆర్ త‌న కుమారుడికి పార్టీలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని సృష్టించి ఇచ్చారు. దీనికి కూడా కేటీఆర్ న్యాయం చేస్తున్నార‌నే భావ‌న పార్టీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డంతో పాటు.. ఏస‌మ‌స్య వ‌చ్చినా.. షార్ప్ షూట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే నేర్పు కేటీఆర్ సొంతం. ఇదిలావుంటే.. కేటీఆర్‌కు ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌నే ప్ర‌చారం ప్ర‌స్తుతం కొత్త‌కాదు. గ‌తంలోనూ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కేంద్రంలో ప‌ట్టు పెంచుకోవ‌డం కోసం.. ముఖ్యంగా బీజేపీకి దీటుగా ప్ర‌త్యామ్నాయ పొలిటిక‌ల్ వేదిక‌ను రెడీ చేసుకునేందుకు కేసీఆర్ అప్ప‌ట్లో ప్ర‌య‌త్నాలు చేశారు.

ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ను త‌న‌కుమారుడికి అప్ప‌గిస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఈ ప్ర‌తిపాద‌న మొగ్గ‌ద‌శ‌లో ప‌క్క‌కు జ‌ర‌గ‌డంతో.. కేసీఆర్‌.. సీఎంగా మ‌రోసారి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇక‌, ఇప్పుడు బీజేపీ దూకుడు మ‌రింత‌గా పెరిగింది. ప‌రిస్థితి ఇలానే ఉంటే.. మున్ముందు.. త‌న పార్టీకి.. ప్ర‌భుత్వానికి కూడా ఎస‌రు త‌ప్ప‌దు అని భావిస్తున్న కేసీఆర్‌.. ఏకంగా కేంద్రంలోనే పావులు క‌ద‌ప‌డం ద్వారా బీజేపీ కి చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో పూర్తిస్థాయిలో జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టేందుకు వీలుగుఆ .. ఆయ‌న సీఎం ప‌ద‌విని కుమారుడికి అప్ప‌గించాల‌ని అనుకుంటున్నార‌ని.. దీనికి ముహూర్తం కూడా పిక్స్ చేసుకున్నారని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ మార్పు ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో చూడాలి.