Begin typing your search above and press return to search.

కరోనా విలయతాండవం ... మూగబోయిన చెన్నై !

By:  Tupaki Desk   |   4 April 2020 4:00 PM IST
కరోనా విలయతాండవం ... మూగబోయిన చెన్నై !
X
కరోనావైరస్‌ మహమ్మారి తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్‌ ధాటికి తమిళులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే కరోనా విజృంభణలో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి రెండో స్థానం దక్కింది. కరోనా కల్లోలిత ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఒక్కరోజే 102 కేసులుబయటపడ్డాయి. పాజిటీవ్‌ కేసులు సంఖ్య మొత్తం 411కు పెరిగింది. ఈ వైరస్‌ లక్షణాలతో 1,580 మంది వైద్య నిఘాలో ఉన్నారు. దేశం మొత్తం మీద పాజిటీవ్‌ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా - తమిళనాడు రెండో స్థానానికి చేరుకోవడం ఆందోళనకరంగా మారింది.

ఇళ్లను వదిలి బయటకు రావద్దని - స్వీయ గృహనిర్బంధం విధించుకుని కరోనా వైరస్‌ కట్టడికి సహకరించాలని ప్రభుత్వం ఎంతగా మొత్తుకున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో 5 శాతం ప్రజలు లాక్‌ డౌన్‌ ఆంక్షలను అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్నారని రెవెన్యూశాఖ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ గురువారం ప్రకటించారు. దీనితో సీఎం - ప్రభుత్వాధికారులు ప్రజలని ఇళ్లల్లో నుండి బయటకి రావద్దు అంటూ చేతులు జోడించి వేడుకున్నారు. అయితే , శుక్రవారం నాటికి అది పది శాతానికి చేరుకోవడం గమనార్హం.

రాష్ట్రంలో మొత్తం 37 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో కరోనా వ్యాపించి ఉండగా - గణాంకాలను బట్టి అన్ని జిల్లాలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందేపరిస్థితి ఉందని ప్రభు త్వం అంచనా వేసింది. కరోనా వైరస్‌ కల్లోలిత రాష్ట్రంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 86,342 మంది గృహనిర్బంధంలో ఉన్నారు. గురువారం మధ్యాహ్నం నాటి లెక్కల ప్రకారం లాక్ డౌన్ నియమాలని పక్కన పెట్టి బయటకి వచ్చిన 46,970 మందిని అరెస్ట్‌ చేసి సొంతపూచీకత్తుపై వదిలిపెట్టారు. అలాగే 42,035 మందిపై కేసులు పెట్టారు. 35, 206 వాహనాలను సీజ్‌ చేశారు. 26 జిల్లాల్లో 2.75 లక్షల మందికి వైద్య పరీక్షలు చేస్తున్నారు.