Begin typing your search above and press return to search.

అందులో ఏ ఒక్కటి పనిచేసినా ఈ రోజు పరిస్థితి బాగుండేది !

By:  Tupaki Desk   |   30 April 2020 1:30 AM GMT
అందులో ఏ ఒక్కటి పనిచేసినా ఈ రోజు పరిస్థితి బాగుండేది !
X
కరోనా వ్యాధి సోకి బాధ పడుతుండటం ఒక ఎత్తయితే.. వ్యాధితో - లక్షణాలతో మృతి చెందిన వారి అంత్యక్రియల వ్యవహారం మరో ఎత్తు. ప్రభుత్వ నిబంధనల మేరకు కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక విధానాలు పాటించాల్సి ఉండటం - అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించడం వంటి నిబంధనలు ఉండటంతో కరోనా మృతుల అంత్యక్రియలపై కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది.

అలాగే, ఆస్పత్రి నుంచి అంత్యక్రియలు నిర్వహించే స్థలం వరకు మృతదేహం తరలింపు తదితర అంశాలకూ ప్రత్యేక రక్షణ చర్యలు పాటించాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే - అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయా ప్రాంతాల్లోని స్థానికులు అంగీకరించక పోవడంతో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిబంధనల మేరకు కరోనా తో మృతి చెందిన వారి అంత్యక్రియలకు ఆయా శ్మశాన వాటికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. కానీ దానికి స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో నచ్చ జెప్పి ఒప్పించేందుకు సంబంధిత అధికారులు నానాతంటాలు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో జీహెచ్‌ ఎంసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ దహన వాటికలుంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్‌ దహనవాటికల్లో వైరస్‌ అనుమానాలు కూడా ఉండవని చెబుతున్నారు. ఏర్పాటు చేశారు విస్మరించారు. జీహెచ్‌ ఎంసీ గతంలో నగరంలోని నాలుగు ప్రాంతాల్లో విద్యుత్‌ దహనవాటికలను ఏర్పాటు చేసింది. ఒక్కోదానికి దాదాపు రూ.60 లక్షల చొప్పున రూ.2.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటిని కొంతకాలం పాటు నిర్వహించారు. పరిసరాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం.. విద్యుత్‌ వినియోగ బిల్లులు చెల్లించక పోవడం తదితర కారణాలతో వాటిని పట్టించుకో లేదు.

దహనం అనంతరం వెలువడే పొగ - ధూళి వల్ల తమకు ముప్పు అని పరిసరాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు జీహెచ్‌ ఎంసీ అధికారి తెలిపారు. పొగ బయటకు వెళ్లకుండా - ఇతరులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లకు సైతం సిద్ధమైనప్పటికీ వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఒక్క విద్యుత్‌ దహనవాటిక అయినా వినియోగంలో ఉండి ఉంటే కరోనా మృతుల దహన సంస్కారాలకు ఇబ్బందులు లేకుండా ఉండేది అని సంబంధిత అధికారులు అభిప్రాయ పడుతున్నారు.