Begin typing your search above and press return to search.

కరోనా పాజిటివ్ గా తేలిన మేడ్చల్ కుర్రాడి ట్రావెల్ హిస్టరీ ఇదేనా?

By:  Tupaki Desk   |   19 March 2020 3:55 AM GMT
కరోనా పాజిటివ్ గా తేలిన మేడ్చల్ కుర్రాడి ట్రావెల్ హిస్టరీ ఇదేనా?
X
కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తంగా ఉండటం.. ఎక్కడా ఏ చిన్న పొరపాటు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఊహించనిరీతిలో ఉత్పాతం మాదిరి.. విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్న పరిస్థితి. ఇప్పటివరకూ నాలుగైదు కేసులకే పరిమితమైన కరోనా.. బుధవారం రాత్రి పదకొండు గంటల సమయానికి ఒక్కసారిగా పదమూడు పాజిటివ్ కేసులకు చేరుకోవటం తో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి.

బుధవారం కన్ఫర్మ్ అయిన ఎనిమిది పాజిటివ్ కేసుల్లో ఏడుగురు ఇండోనేషియా జాతీయులు కాగా.. మరొకరు మాత్రం మేడ్చల్ జిల్లాకు చెందిన యువకుడు. ఇతగాడు స్కాట్లాండ్ లో బీబీఏ కోర్సు చేసేందుకు వెళ్లాడు. ఈ నెల 16న శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాడు. ఆ రోజంతా కుటుంబ సభ్యులతో గడిపాడు. తర్వాతి రోజున దగ్గు.. జ్వరం లక్షణాలు కనిపించటంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అతడ్ని కుటుంబ సభ్యులే గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు జరపగా.. అతడికి కరోనా పాజిటివ్ అన్నది తేలింది.

స్కాట్ లాండ్ నుంచి వచ్చిన ఈ యువకుడు మొత్తంగా నలుగురితో సన్నిహితంగా మెలిగినట్లుగా గుర్తించి.. వారికి పరీక్షలు నిర్వహించారు. అదే సమయం లో.. అతడు ప్రయాణించిన విమానం.. అందులో ప్రయాణించిన ప్రయాణికులు.. విమాన సిబ్బందిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన అధికారులు.. వారెవరు? ఎక్కడ ఉంటారు? అన్నది ఆరా తీస్తున్నారు. ఇతగాడు ప్రయాణించిన విమానంలోని వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.