Begin typing your search above and press return to search.

ఆ ఒక్కడు తమిళనాడులో ఎన్ని కేసులు పెంచేశాడంటే

By:  Tupaki Desk   |   14 April 2020 3:30 AM GMT
ఆ ఒక్కడు తమిళనాడులో ఎన్ని కేసులు పెంచేశాడంటే
X
కరోనా విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ విషయం పలుమార్లు నిరూపితమైంది కూడా. అమెరికా లాంటి అగ్రరాజ్యమే ఈ మహమ్మారి కారణంగా అతలాకుతలమైపోతోంది. మన దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నా.. మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. అయితే.. గడిచిన ఐదారు రోజులుగా పరిస్థితి మారటమే కాదు.. పాజిటివ్ కేసుల జోరు పెరుగుతోంది. ఇలాంటివేళ.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

తాజాగా తమిళనాడులో వెలుగు చూసిన ఒక ఉదంతం కరోనా తీవ్రత ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టేలా మారింది. ఒక వ్యక్తి కారణంగా ఏకంగా 91 పాజిటివ్ కేసులు నమోదు కావటం పై విస్మయం వ్యక్తమవుతోంది. ఇతగాడి పుణ్యమా అని.. తమిళనాడులో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పుడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1173కు చేరాయి.

ఆశ్చర్యం కలిగించే అంశం ఏమంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు చాలా ఆలస్యంగా మొదలైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తమిళనాడే. అలాంటిది.. ఇప్పుడా రాష్ట్రం మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం. కరోనా కారణంగా తమిళనాడు లో ఇప్పటి వరకూ పదకొండు మంది మరణిస్తే.. మొత్తం కేసుల్లో పదేళ్ల లోపు చిన్నారులు సంఖ్య కాస్త ఎక్కువనే చెబుతున్నారు. కరోనా తీవ్రత తెలిపే తాజా ఉదంతాన్ని చూసినప్పుడు దేశంలోని మిగిలిన ప్రాంతాల వారు ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని తమిళనాడు ఉదంతం చెప్పేస్తుందని చెప్పక తప్పదు.