Begin typing your search above and press return to search.

కరోనాకు దూరంగా ఉత్తరకొరియా.. కిమ్ ఏం చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   23 March 2020 9:00 PM IST
కరోనాకు దూరంగా ఉత్తరకొరియా.. కిమ్ ఏం చేస్తున్నారు?
X
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎక్కడో యూరప్ లోని ఇటలీ, గల్ఫ్ లోని ఇరాన్ లో మరణ మృందంగం వినిపిస్తోంది. ఇప్పటివరకు 3.36 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 13వేల మందికి పైగా మరణించారు. 180దేశాల్లో బాధితులున్నారు. మెరుగైన వైద్య సదుపాయాలున్న దేశాలు కూడా కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా చైనాకు ఆనుకొని ఉన్న ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తరకొరియాలో కరోనాతో ఒక్కరు కూడా మరణించలేదట.. ఆ దేశ ప్రభుత్వం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఉత్తరకొరియా నియంత, అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రాజ్యంలో ఇప్పుడు కరోనా లేదనడంతో అసలు అక్కడ ఏం జరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

ఉత్తరకొరియాకు ఆనుకొని ఉన్న దక్షిణ కొరియాలో వందలాది మందికి కరోనా సోకింది.వేలమంది చికిత్స పొందుతున్నారు. ఉత్తరకొరియా మాత్రం చైనా, దక్షిణ కొరియా సరిహద్దులను మూసివేసింది.

అసలు ఉత్తరకొరియాకు ఈ వైరస్ ను ఎదుర్కొనే పరిజ్ఞానం లేదని.. వైద్యులకు కూడా తేల్చడం రాదని.. అందుకే వందలాది మందికి సోకినా వైరస్ తేల్చలేక మిన్నకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఉత్తరకొరియా మెడికల్ సిస్టమ్ పెద్దగా అభివృద్ధి చెందకపోవడంతో కరోనా బాధితులను కనిపెట్టడం కూడా కష్టమని దక్షిణకొరియా హెల్త్ ఎమర్జెన్సీ సర్వీస్ డాక్టర్ సంచలన ప్రకటన చేశారు.

చైనాలో కరోనా సోకగానే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. రవాణా వ్యవస్థ బంద్ చేశారు. ప్రజలు రోడ్లపై తిరగకుండా నిబంధన విధించారు. దీంతో కరోనా వ్యాధి విస్తరణపై ఎవరికీ ఏం తెలియడం లేదని అంటున్నారు.

అయితే ఎన్జీవో నేత రాబర్ట్ సంచలన విషయం తెలిపారు. ఉత్తరకొరియాలో 23మంది కరోనాతో చనిపోయారని.. 82మంది క్వారంటైన్ లో ఉన్నారని.. 200 మంది ఉత్తరకొరియా సైనికులు కరోనాతో చనిపోయారని బాంబు పేల్చారు. ఉత్తరకొరియాలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో అక్కడ మరణాల సంఖ్య చాలా ఎక్కువ ఉండొచ్చని అధ్యక్షుడు కిమ్ జాంగ్ దాచేస్తున్నారన్న అనుమానం ప్రపంచవ్యాప్తంగా కలుగుతోంది. దక్షిణ కొరియాకు కరోనాపై సహకరించుకుందామని రాసిన లేఖ కూడా అనుమానాలకు తావిస్తోంది.