Begin typing your search above and press return to search.

ఇండియా గురించి ఇటలీ ఆందోళన...ఎందుకంటే

By:  Tupaki Desk   |   24 March 2020 12:30 AM GMT
ఇండియా గురించి ఇటలీ ఆందోళన...ఎందుకంటే
X
కరోనా దెబ్బకు ప్రపంచదేశాలన్నీ వణికిపోతోన్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా మొదలుకొని...అనామక దేశాల వరకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. లాక్ డౌన్ లు ప్రకటించడం ద్వారా కొంతవరకు ఉపశమనం పొందుతున్నప్పటికీ..పూర్తిగా వైరస్ ను నిరోధించినట్లు కాదు. ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా అంతగా వ్యాప్తి చెందనప్పటికీ షట్ డౌన్ ఎందుకు విధించారంటూ కొందరు మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఇటలీ వంటి దేశాలు షట్ డౌన్ చేయకపోవడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి మొత్తుకుంటున్నా కొందరికి కనువిప్పు కలగడం లేదు. ఇటలీ తరహాలో మన దేశం కాకూడదని చేస్తున్న ప్రయత్నాలను ఎద్దేవా చేస్తున్నారు. ఇటువంటి వారందరినీ ఉద్దేశించి ఇటలీ, అమెరికా డాకర్లు చెబుతున్న విషయాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కరోనా దెబ్బకు ఇప్పటికే సరిపడా బెడ్లు, ఐసోలేషన్ వార్డులు లేక అల్లాడిపోతున్నామని.... కరోనా పూర్తి స్థాయిలో విజృంభిస్తే తమ పరిస్థితి అగమ్య గోచరమని చెబుతున్నారు.


ఇటలీలో కరోనా దెబ్బకు హాస్పటళ్లు కిక్కిరిసిపోతున్నాయి. కరోనా పాజిటివ్ వారికి చికిత్స అందించడానికి కూడా సరిపడా వైద్య సిబ్బంది, బెడ్లు లేక అక్కడి వారు అల్లాడిపోతున్నారు. దీంతో, 80 ఏళ్లు దాటిన వారికి చికిత్స చేయడం కూడా మానేశారు. ఇక, అమెరికాలో అయితే ఇప్సటికి కరోనా వల్ల ఆసుపత్రులు నిండుగా ఉన్నాయి. అయితే, కరోనా పూర్తి స్థాయిలో కోరలు చాస్తే తమ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని టెక్సాస్ కు చెందిన డాక్టర్ ఒళ్లు గగుర్పొడిచే నిజాలు చెప్పారు. అమెరికాలో 331 మిలియన్ ప్రజలున్నారని...వారిలో 50 మిలియన్ల వరకు కరోనా బారిన పడే అవకాశాలున్నాయని అన్నారు. అయితే, వారిలో 80 శాతం మంది ఆసుపత్రికి రానవసరం లేదని...హౌస్ క్వారంటైన్, ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటే చాలని అన్నారు. కానీ, మిగతా 20 శాతం మందిని హాస్పటళ్లకు తరలించి చికిత్స అందించాలని, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుందని అంటున్నారు. అంతమందికి చికిత్స అందించేన్ని బెడ్లు, ఆసుపత్రులు, వైద్య సిబ్బంది అమెరికాలో సైతం లేవని, ఇటలీలో వారు ఎదుర్కొంటున్న సమస్యనే తామూ ఎదుర్కొవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో సరిపడా బెడ్లు లేక కారిడార్లలో నేలపై పేషెంట్లకు చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో వైద్యం చేయడం కత్తి మీద సామువంటిదని అంటున్నారు.

అభివృద్ధి చెందిన అమెరికా, ఇటలీ వంటి దేశాలే సరిపడా బెడ్లు వైద్య సిబ్బంది లేక అల్లాడిపోతోంటే....ఇక అభివృద్ధి చెందుతోన్న భారత్ వంటి దేశాలలో కరోనా కోరలు చాస్తే....పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవడానికే భయం వేస్తోందని అమెరికా, ఇటలీ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ ముందు జాగ్రత్త చర్యగా లాక్ డౌన్ విధించిందని, అంత మాత్రాన కరోనాను కట్టడి చేసినట్లు కాదని అంటున్నారు. అనుమానిత కేసులన్నింటినీ నిర్బంధ ఐసోలేషన్, క్వారంటైన్ చేయాలని...దాదాపుగా కరోనా అనుమానం ఉన్న ప్రజల కోసం ముమ్మర తనిఖీలు చేపట్టాలని అంటున్నారు. అనుమానం ఉన్నవారిని ఐసోలేషన్, క్వారంటైన్ కు తరలించాలని అంటున్నారు. అయితే, భారత ప్రజలు లాక్ డౌన్ ను కూడా విస్మరించి ఇటలీ వాసుల్లాగా ప్రవర్తిస్తున్నారని....ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిపుడు కరోనా రెచ్చిపోతే....భారత్ తట్టుకునే స్థాయిలో లేదని....అది మరో ఇటలీ కాకముందే ప్రజలు మేలుకోవాలని సూచిస్తున్నారు.