Begin typing your search above and press return to search.

తెలంగాణ లో ఆ ఒక్కటి.. ఏపీలో ఏకంగా మూడు!

By:  Tupaki Desk   |   28 April 2020 4:00 AM GMT
తెలంగాణ లో ఆ ఒక్కటి.. ఏపీలో ఏకంగా మూడు!
X
కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాన్ని నిలువరించటం అంత తేలికైన విషయం కాదు. దేశంలోని పలు రాష్ట్రాలకు కరోనా పాజిటివ్ కేసులు అన్నది పరిచయం కాని వేళలోనే.. తెలంగాణ రాష్ట్రంలో కేసు నమోదు కావటం చాలామందిని కలవరపాటుకు గురి చేసింది. పాజిటివ్ కేసు బయటకు వచ్చి.. దానికి సంబంధించిన ట్రీట్ మెంట్ సాగుతున్న వేళలోనూ ఏపీలో ఎలాంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. తెలంగాణతో పోలిస్తే చాలా ఆలస్యంగా ఏపీలోకి అడుగు పెట్టింది మాయదారి వైరస్.

సిత్రమైన విషయం ఏమంటే.. కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఎక్కువగా ఉండటమే కాదు.. రోజు గడిచే కొద్దీ కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. వాస్తవానికి తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కట్టడి చర్యల తీవ్రత ఎక్కువ. చాలామంది మర్చిపోయారు కానీ.. కరోనా విషయంలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు ఎంత కటువుగా ఉన్నాయన్నది చర్చకు రావట్లేదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. మరెన్ని సిఫార్సులు చేసినా.. తన పాలసీ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న విషయాన్ని ఏపీ సర్కారు ఎప్పటికప్పుడు స్పష్టం చేసింది.

హైదరాబాద్ నుంచి వేలాదిమంది ఏపీకి వెళ్లే ప్రయత్నం చేసిన ఉదంతాన్ని మర్చిపోకూడదు. అప్పటికి ఏపీలో కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువ. అయినప్పటికీ.. తెలంగాణ నుంచి వస్తున్న వారిని అదే పనిగా అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పటాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ ముఖ్యమంత్రి.. మంత్రులు రంగంలోకి దిగినా.. ససేమిరా అనటమే కాదు.. క్వారంటైన్ కు ఓకే అయితే అనుమతిస్తామని తేల్చి చెప్పారు.

ఎంతోమందిని వెనక్కి పంపారు కూడా. ఏపీ నుంచి తెలంగాణకు రావటం సులువని.. అదే సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లటం అంత తేలికైన విషయం కాదన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. పోలీసు ఉన్నతాధికారులు సైతం ఇదే విషయాన్ని చెబుతుంటారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఏపీలో కేసుల తీవ్రత ఎందుకు పెరుగుతుందన్నది ప్రశ్న. దీనికో కారణం ఉంది.

తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో కేసులు నమోదైనా.. దాని తీవ్రత పెద్దగా లేదన్నది మర్చిపోకూడదు. హైదరాబాద్ మినహా ట్రిపుల్ డిజిట్ లో కేసులు నమోదైన జిల్లా ఏదీ లేదన్నది మర్చిపోకూడదు. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ జిల్లాలు చాలా చిన్నవి. దీంతో.. కేసుల నమోదైన వెంటనే చర్యలు చాలా సులువు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఏపీలో జిల్లాలు తక్కువగా ఉన్నా.. దాని విస్తీర్ణం.. జనసాంద్రత చాలా ఎక్కువ. ఇదే ఇప్పుడు శాపంగా మారింది.

ఏపీలో ఇప్పుడు 1177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు జిల్లాల్లోనే 800 కేసులు పాజిటివ్ కావటం ఒక ఎత్తు అయితే.. మరో మూడు జిల్లాల్లోనే 200 కేసులు నమోదయ్యాయి. అంటే.. మొత్తం 13 జిల్లాలో 12 జిల్లాల్లో కేసులు నమోదైతే.. ఐదు జిల్లాలోనే 85 శాతం కేసులు ఉన్నాయి. అందులోనూ 70 శాతం కేసులు మూడు జిల్లాల్లోనే ఉండటం అసలు సమస్య.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు.. అధికార యంత్రాంగం మొత్తం అందుబాటులో ఉండటం ఒక సానుకూలాంశమైతే.. ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో ఉంది. భారీగా కేసులు నమోదైన మూడు జిల్లాల్లో కర్నూలు 292 కేసులతో మొదటి స్థానంలో ఉంటే.. తర్వాతి స్థానం గుంటూరు జిల్లాది. ఆ జిల్లాలో 237 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో క్రిష్ణా జిల్లా. అక్కడ 210 కేసులు నమోదయ్యాయి. అంటే.. రెండు వందల కేసులు దాటిన జిల్లాలు మూడు ఉండటం.. వాటి విస్తీర్ణం ఎక్కువగా ఉండటం.. జనసాంద్రత కూడా భారీగా ఉండటం కేసుల వ్యాప్తి త్వరగా జరగటానికి కారణంగా చెప్పక తప్పదు.

ఇది చాలదన్నట్లుగా ఏపీకి ఒక మూలన ఉండే చిత్తూరులో 73 కేసులు నమోదైతే.. దానికి పక్కనే ఉండే నెల్లూరు జిల్లాలో 79 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చూసినప్పుడు తెలంగాణలో కరోనా ఒకేచోట పోగుబడినట్లుగా ఉంటే.. ఏపీలో మాత్రం వికేంద్రీకరణ కావటం తో.. దాన్ని కట్టడి చేయటం ఇబ్బందిగా మారిందని చెప్పక తప్పదు.