Begin typing your search above and press return to search.

‘కృష్ణా’, ‘తూర్పు’లకూ పాకిన కరోనా... బెజవాడలో 3 రోజుల పాటు ‘కర్ఫ్యూ’

By:  Tupaki Desk   |   22 March 2020 11:18 AM GMT
‘కృష్ణా’, ‘తూర్పు’లకూ పాకిన కరోనా... బెజవాడలో 3 రోజుల పాటు ‘కర్ఫ్యూ’
X
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోందనే చెప్పాలి. అంతర్జాతీయంగా మంచి సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇప్పటికే కరోనా భయంతో వణికిపోతుండగా... నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలోని విజయవాడలోనూ ఇప్పుడు కరోనా కలకలం రేగింది. బెజవాడలోని వన్ టౌన్ కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అక్కడ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అదే సమయంలో ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలోనూ తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మొత్తంగా ఏపీలో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ కేసులు ఐదుకు చేరినట్టైంది.

బెజవాడకు సంబంధించి వన్ టౌన్ కు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు ఇటీవలే పారిస్ నుంచి తిరిగి వచ్చాడట. విదేశాల నుంచి వచ్చే వారితోనే కరోనా పాకుతున్న నేపథ్యంలో సదరు యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా... అతడికి పాజిటివ్ అని తేలిందట. ఈ వార్త బయటకు రాగానే బెజవాడలో కలకలం రేగింది. అంతేకాకుండా సరిగ్గా జనతా కర్ఫ్క్ష్ూ మొదైలన కొన్ని గంటలకే ఈ వార్త బయటకు రావడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైపోయింది. బెజవాడలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు కర్ఫ్యూను అమలు చేస్తే ఎలా ఉంటుందన్న భావన వినిపించిన మరుక్షణమే రంగంలోకి దిగిన బెజవాడ పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు... నగరంలో మరో మూడు రోజుల పాటు జనతా కర్ఫ్యూను నిర్బంధంగానే అమలు చేయనున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే... పచ్చటి పంట పొలాలకు ఆలవాలంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోనూ తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు ఇటీవలే లండన్ నుంచి జిల్లాకు తిరిగివచ్చాడట. లండన్ నుంచి తొలుత హైదరాబాద్ కు అక్కడి నుంచి రాజమహేంద్రవరానికి వచ్చాడట. ఈ క్రమంలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందట. ఇదిలా ఉంటే... ఇదే జిల్లాకు చెందిన మరో యువతిని కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్ కు తరలించారట. జిల్లాలోని అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడికి చెందిన యువతికి కరోనా లక్షణాలున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇటీవలే ఖతర్ నుండి ఇండియాకు వచ్చిన సదరు యువతికి కరోనా వ్యాధి లక్షణాలున్నాయన్న సమాచారం తో హుటాహుటీన రంగంలోకి దిగిన అధికారులు ఆమెనుబ రాజమండ్రి జిజిహెచ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారట.