Begin typing your search above and press return to search.

అనకాపల్లిలో అలజడి ... ఏపీలో మరో రెండు కరోనా కేసులు ?

By:  Tupaki Desk   |   12 March 2020 7:06 AM GMT
అనకాపల్లిలో అలజడి ... ఏపీలో మరో రెండు కరోనా కేసులు ?
X
ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా , ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కూడా పాకింది. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలు కనిపించాయని అధికారులు చెప్పారు. తర్వాత అతనికి కరోనా లేదు అని ప్రకటించారు. ఆ తరువాత నెల్లూరు లో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు గుర్తించారు. అతను ఇరాన్ నుంచి రావడంతో ప్రత్యేకంగా ఉంచి కరోనా కి చికిత్స అందిస్తున్నారు. ఇటువంటి సమయం లో ఏపీ లో మరో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదు కావడం అందరిని ఆందోళనకి గురిచేస్తుంది.

కాగా.. తాజాగా అనకాపల్లి లో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
ఆ ఇద్దరిలో ఒకరు ఇటలీ నుంచి రాగా, మరొకరు సింగపూర్ నుంచి వచ్చారు. కాగా ఇద్దరు అనుమానితులు విశాఖలోని అనకాపల్లికి చెందినవారే. ఈ ఇద్దరు అనుమానితులను విశాఖ పట్నంలోని చెస్ట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

శారదా కాలనీకి చెందిన కృష్ణ భరద్వాజ్‌ అనే యువకుడు ఇటలీలో చదువుకుంటూ అనకాపల్లి వచ్చాడు. అతనికి ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేశారు. ఎటువంటి వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా దగ్గుతో బాధపడుతుండడంతో విశాఖ చెస్ట్‌ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న జీవీఎంసీ సీఎంహెచ్‌వో శాస్త్రి శారదా కాలనీకి వచ్చి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. అతనికి కరోనా నిర్థారణ కాలేదని, కేవలం అనుమానం మాత్రమేనని వైద్యులు తెలిపారు.

మరో వ్యక్తి రావికమతం మండలానికి చెందిన ఎం. కుమార్‌ అనే యువకుడు సింగపూర్‌ నుంచి కొద్ది రోజుల కిందట విశాఖ వచ్చాడు. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిపిన స్క్రీనింగ్‌ టెస్ట్‌ లో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. కానీ , ఆ తరువాత కరోనా వ్యాధి లక్షణాలైన దగ్గు ,జలుబు రావడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ విశాఖ చెస్ట్‌ ఆస్పత్రిలో ని ప్రత్యేక వార్డ్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా అనకాపల్లిలో ఇద్దరు వ్యక్తులకు కరోనా అనుమానిత లక్షణాలున్నట్టు ప్రచారం జరగడం తో పట్టణ వాసులు భయాందోళన కు గురవుతున్నారు. అయితే , వారికీ కరోనా సోకింది అని నిర్దారణ కాలేదు అని, కేవలం అనుమానం మాత్రమే అని వైద్యులు తెలిపారు.