Begin typing your search above and press return to search.

కరోనాని నియంత్రించడం లో అమెరికా ఎందుకు , ఎక్కడ విఫలం అవుతుంది ..?

By:  Tupaki Desk   |   1 April 2020 2:30 AM GMT
కరోనాని నియంత్రించడం లో అమెరికా ఎందుకు , ఎక్కడ విఫలం అవుతుంది ..?
X
అమెరికా ..ప్రపంచ దేశాల పెద్దన్న. అగ్రరాజ్యం ..ఎన్నో సమస్యలని తమకున్న బలంతో చాలా సునాయాసంగా ఎదుర్కొంది. కానీ , కరోనా దెబ్బకి అతలాకుతలం అవుతుంది. వైరస్ దెబ్బకు ఇంతలా విలవిల్లాడిపోవడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. అమెరికాకే ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ఇక పేద దేశాల పరిస్థితేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత శక్తివంతమైన దేశంగా పేరు తెచ్చుకున్న అమెరికా.. కరోనా వైరస్‌ ను నియంత్రించడంలో ఎక్కడ విఫలం అయ్యింది అనే చర్చ కూడా జరుగుతోంది.

దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ..అమెరికాలో ఇప్పటివరకు 164,253 పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవగా.. 3,167 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం కేసుల్లో 70 వేలకి పైగా కేసులు ఒక్క న్యూయార్క్ సిటీలో ,15 వేల కేసులు న్యూజెర్సీ లో నమోదయ్యాయి. న్యూయార్క్‌ లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతున్నా.. దేశ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటి వరకు అక్కడ లాక్ డౌన్ ప్రకటించ లేదు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ తరహాలో అమెరికన్ ప్రభుత్వానికి అమెరికా లో ఒకే విధమైన అధికార నియంత్రణ లేదు. ట్రంప్ క్వారెంటైన్ నిర్ణయానికి న్యూయార్క్,న్యూజెర్సీ రాష్ట్రాల గవర్నర్ల నుంచి వ్యతిరేకత రావడంతో అది అమలు కాలేదు.

అమెరికాలో ఉన్నది ఫెడరల్ గవర్నమెంట్ కావడంతో.. చైనాలో చేసినట్టు అమెరికాలో కరోనా అనుమానితులను బలవంతంగా క్వారెంటైన్ చేయడానికి కుదరదు. నిజానికి న్యూయార్క్ సిటీ,న్యూయార్క్,న్యూజెర్సీ.. ఈ మూడు నగరాల నుంచి రాబోయే 14 రోజుల పాటు ప్రయాణాలను నిలిపి వేయాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విజ్ఞప్తి చేసింది. ట్రంప్ సూచన మేరకే ఈ విజ్ఞప్తి చేసినట్టుగా చెబుతారు. అయితే ట్రావెల్ ఆంక్షలపై అక్కడి గవర్నర్లు పూర్తి విరుద్దంగా స్పందించారు. ఇలాంటి ఆంక్షలు యాంటీ అమెరికన్, యాంటీ సోషల్ అంటూ అభిప్రాయ పడ్డారు.

అక్కడి గవర్నర్లకు పూర్తి స్థాయి విచక్షణాధికారులు ఉండటంతో ట్రంప్ కూడా ఏమీ చేయలేక పోతున్నారు. ఫలితంగా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టని పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా వైరస్ సోకినవారు దేశమంతా ఇష్టారీతిన తిరుగుతూ వైరస్‌ను వ్యాప్తి చెందిస్తున్నారు. దే పరిస్థితి కొనసాగితే అమెరికాలో లక్ష నుంచి 2లక్షల మంది వరకు చనిపోయే ప్రమాదం ఉందని ప్రముఖ వైద్యుడు డా.ఫౌసీ అభిప్రాయ పడ్డారు. కరోనా వైరస్ నియంత్రణ పట్ల ట్రంప్ నిర్లక్ష్యం కూడా ఇంతటి విషాదానికి కారణమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 20న అమెరికాలో 35 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో దేశంలో తొలి కేసు నమోదైంది. అదే సమయంలో సౌత్ కొరియాలోనూ మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. కానీ నియంత్రణ చర్యల విషయంలో అమెరికా,సౌత్ కొరియా మధ్య చాలా తేడాలున్నాయి. అంతా కంట్రోల్‌లోనే ఉందంటూ కొద్దిరోజుల పాటు ట్రంప్ చేసిన ప్రకటనలు దేశాన్ని నిండా ముంచాయి. దీనితో ఈ కరోనా మహమ్మారి ఇంకెంత మందిని బలి తీసుకుంటుందో అని అక్కడి ప్రజలు భయానికి గురౌతున్నారు.