Begin typing your search above and press return to search.

ఇవాల్టి నుంచి ఫూణెకు అక్కర్లేదు.. హైదరాబాద్ లోనే..

By:  Tupaki Desk   |   3 Feb 2020 4:57 AM GMT
ఇవాల్టి నుంచి ఫూణెకు అక్కర్లేదు.. హైదరాబాద్ లోనే..
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద భారీగానే ఉంది. చైనాకు రాకపోకలు ఎక్కువగా ఉండటంతో పాటు.. వ్యాపార పరంగా ఆ దేశంలో భారీ డీల్స్ నిత్యం నడుస్తూ ఉంటాయి. కరోనా పుణ్యమా అని అలాంటి వాటికి బ్రేకులు పడ్డాయి. కరోనా వైరస్ లక్షణాలు కనిపించినంతనే.. కంగారు గా పరీక్షలకు వెళ్లటం.. ఆ శాంపిల్స్ ను తీసుకొని రోడ్డు మార్గాన.. ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ నుంచి ఫూణె వరకూ వెళ్లాల్సిన పరిస్థితి. పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత కానీ.. కరోనా వైరస్ ఉన్నది లేనిది తేలే పరిస్థితి. ఇందుకోసం కనీసం 24 గంటలకు పైనే వెయిట్ చేయాల్సి వచ్చేది.

ఈ రోజు నుంచి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి. వైరస్ లక్షణాల్ని గుర్తించే సాంకేతికతను హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో తీసుకొచ్చారు. కేంద్రం అనుమతితో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో కరోనా వైరస్ లక్షణాలున్నాయని అనుమానించే వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు.

అదే పనిగా దగ్గు.. విడవకుండా పది నిమిషాల పాటు తుమ్ములు.. ముక్కు కారటంతో పాటు హై ఫీవర్.. ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉంటే.. అలాంటి వారు వెంటనే తమ శాంపిల్స్ ను గాంధీ ఆసుపత్రి లో ఇవ్వొచ్చు. వాటిని పరీక్షలు జరిపి.. వెంటనే రిజల్ట్ ఇస్తారు.గాంధీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం కారణంగా.. కరోనా వైరస్ ఉందా? లేదా? అన్న విషయాన్ని సులువు గా గుర్తించే వీలుంది.

పరీక్షలో నెగిటివ్ వస్తే ఓకే. కానీ.. పాజిటివ్ వస్తే మాత్రం వెంటనే ఆ వ్యక్తిని ప్రత్యేక వార్డుకు తరలిస్తారు. సదరు వ్యక్తి కుటుంబాన్ని ప్రత్యేక అబ్జర్వేషన్లో ఉంచనున్నారు. కరోనా పరీక్ష లో పాజిటివ్ వచ్చినోళ్ల కు రెగ్యులర్ గా జలుబు.. దగ్గు.. జ్వరాల్ని తగ్గించే మందుల్నే ఇవ్వనున్నారు. అదే సమయంలో ఆ వ్యక్తి మరెవరినీ కలవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అంతేకాదు.. వారికి కేంద్రం నుంచి వచ్చిన కిట్లను ఇవ్వనున్నారు. అందులో సూచించిన విధంగా మందులు వాడుకోవాల్సి ఉంటుంది. కరోనా లెక్క తేల్చేందుకు పూణె వరకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం తెలుగు వారికి పెద్ద ఎత్తున సాయం చేస్తుందని చెప్పక తప్పదు.