Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా కలకలం - 11 అనుమానిత కేసులు

By:  Tupaki Desk   |   4 March 2020 2:24 PM GMT
ఏపీలో కరోనా కలకలం - 11 అనుమానిత కేసులు
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్ 19) కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 3,000 మందికి పైగా మృతి చెందారు. దాదాపు లక్షమందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకింది. బెంగళూరులో పని చేస్తోన్న ఓ హైదరాబాద్ టెక్కీ దుబాయ్‌కు వెళ్లినప్పుడు కరోనా సోకింది. అతనికి చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా ఆందోళనలు కలిగిస్తోంది. కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.

ఏపీలో 11 కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు బుధవారం తెలిపింది. విశాఖపట్నంలో 5, శ్రీకాకుళంలో మూడు, ఏలూరు, విజయవాడ, కాకినాడలలో ఒక్కో కేసు నమోదయినట్లు తెలిపారు. కరోనా అనుమానితులను ఆసుపత్రులకు తరలించి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు. రిపోర్ట్స్ రావడానికి ఒకటి రెండు రోజులు పట్టనుంది. ఆ తర్వాతే కరోనా వైరస్ వచ్చిందా లేదా తెలియనుంది.

ఓ వ్యక్తి ఫిబ్రవరి 18న మస్కట్ నుండి ఇంటికి వచ్చారు. ఆయన కరోనా అనుమానంతో ఆసుపత్రిలో చేరాడు. విశాఖలో సింగపూర్ నుండి వచ్చిన ఓ కుటుంబం జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతోంది. ఆ కుటుంబాన్ని వైద్యులు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మరో వ్యక్తి ఇటీవల పదిహేడు రోజుల పాటు జర్మనీకి వెళ్లి వచ్చాడు. ఇతను విజయవాడవాసి. హైదరాబాదులో స్థిరపడ్డాడు. ఆయన బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు వచ్చాడు. అతను కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు.

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా 28 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఢిల్లీలో తెలిపారు. ఢిల్లీలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబానికి, అలాగే ఆగ్రాలోని ఆరుగురికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు చెప్పారు. కేరళలో మూడు - ఢిల్లీలో 1 - తెలంగాణలో ఒక కేసు నమోదయిందన్నారు. అలాగే, పదహారు మంది ఇటాలియన్లతో పాటు డ్రైవర్‌కు కరోనా సోకినట్లు చెప్పారు. వారిని ఐజోలేషన్ సెంటర్‌కు పంపి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి 88 మందిని కలిసినట్లు తేలిందని, వారిని కూడా పరీక్షిస్తున్నట్లు తెలిపారు. విదేశీయులు వెనక్కి వెళ్లాలన్నా ఆయా దేశాలు రానివ్వడం లేదని, దీంతో వారిని ప్రత్యేక క్యాంపుల్లో ఉంచుతున్నట్లు తెలిపారు.