Begin typing your search above and press return to search.

స్వామీజీ పిచ్చ పీక్స్.. కొవిడ్ విగ్రహం తయారు చేసి పూజలు చేయాలట

By:  Tupaki Desk   |   18 Feb 2020 10:15 AM IST
స్వామీజీ పిచ్చ పీక్స్.. కొవిడ్ విగ్రహం తయారు చేసి పూజలు చేయాలట
X
ఇప్పుడు ఏ నోట విన్నా కొవిడ్ ప్రస్తావన రాకుండా లేని పరిస్థితి. ప్రపంచమంతా భయం తో వణికి పోతున్న ఈ మాయదారి వైరస్ గురించి కొంగొత్త వార్తలు వస్తున్నాయి. తాజాగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ప్రపంచంలోని 10 శాతం మంది జనాభా కు కొవిడ్ ముప్పు ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే 1700 మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి వేలాది మంది ప్రాణాల్ని బలి తీసుకునేందుకు తన పడగనీడ పడేలా చేసింది. కొవిడ్ వైరస్ పిశాచి అని.. దాంతో తాము పోరాడుతున్నట్లు గా చైనా అధ్యక్షడు స్వయంగా ప్రకటిస్తే.. భారత్ కు చెందిన స్వామీజీ ఒకరు తన మాటలతో షాకిచ్చారు.

ఎలాంటి పరిస్థితికైనా సరే.. సై అన్నట్లుగా వ్యవహరించే చైనా ఆర్థిక వ్యవస్థను కంటికి కనిపించని ఈ మాయదారి వైరస్ అతలాకుతలం కావటమే కాదు.. ఎప్పటికి కోలుకుంటారా? అన్నది ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ మాయదారి వైరస్ ను కంట్రోల్ చేయటం ఎలా? అన్నది క్వశ్చన్ గా మారింది. ఇలాంటి వేళ.. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షులు స్వామి చక్రపాణి చేసి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి.

స్వామి మాటల్లో చెబితే కరోనా (కొవిడ్ 19) వైరస్ కానే కాదని.. జంతువుల్ని కాపాడేందుకు దిగి వచ్చిన అవతారమని వ్యాఖ్యానించారు. వాటిని తినే వారిని దండించేందుకు.. ప్రాణ భయం చెప్పేందుకే వచ్చిందంటూ అనవసరమైన వ్యాఖ్యల్ని చేసుకొచ్చారు. కొవిడ్ కు భయపడాల్సిన అవసరం లేదని.. అవసరమైతే.. సదరు వైరస్ విగ్రహాన్ని తయారు చేయించి.. పూజలు చేయాలన్నారు.

మూగజీవాల్ని చంపబోమని.. వాటిని హింసించమని.. చెబుతూ క్షమాపణ కోరాలని చైనా అధ్యక్షుడికి అద్భుతమైన సలహాను ఇచ్చారు. మూగ జీవాల జోలికి వెళ్లమని ప్రతిజ్ఞ చేస్తే కొవిడ్ తన లోకానికి తాను వెళ్లి పోతుందంటూ సదరు స్వామిజీ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. పిచ్చ పీక్స్ కు వెళ్లిందన్న అభిప్రాయం కలుగక మానదు. ఈ తరహా వ్యాఖ్యలు కొందరు స్వామీజీలకు మాత్రమే సాధ్యమేమో?