Begin typing your search above and press return to search.

ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకు కరోనా 'టీకా' .. ఎప్పుడంటే ?

By:  Tupaki Desk   |   19 March 2021 8:30 AM GMT
ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకు కరోనా టీకా .. ఎప్పుడంటే ?
X
ఏపీలో కరోనా వైరస్ వ్యాక్సిన్ కార్యక్రమం వేగంగా సాగుతుంది. రెండోదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా కేంద్రం నిబంధనలకు అనుగుణంగా 60 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వృద్ధులు, 45 సంవత్సరాల పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న వారికి జగన్ సర్కార్ కరోనా టీకాలను అందిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఈ టీకాలను వేస్తోండగా.. ప్రైవేటు హాస్పిటల్స్‌ లో ఒక్కో డోసుకు 250 రూపాయలను వసూలు చేస్తుంది. ఈ పరిస్థితుల మధ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వారికి టీకాలు వేస్తారు. అమరావతి ప్రాంతంలోని వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అసెంబ్లీ కార్యదర్శి పీ బాలకృష్ణమాచార్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీకాలను వేయించదలచుకున్న వారు తమ వెంట ఆధార్ కార్డు జిరాక్స్‌ కాపీలను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుందని సూచించారు. చివరి రెండు రోజుల్లో అంటే.. 25, 26 తేదీల్లో సచివాలయం ఉద్యోగులు, సిబ్బందికి టీకాలను వేస్తారు. శాసనసభ, శాసన మండలి సమావేశాల కవరేజీకి వెళ్లే జర్నలిస్టులకు కూడా ఈ సౌకర్యాన్ని వర్తింపజేసినట్లు బాలకృష్ణమాచార్యలు తెలిపారు. దీన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఇదిలా ఉంటే .. ఏపీ సర్కార్,రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అవకాశం ఉన్నంత మేర వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరో మారు అవలంభించాల్సిందిగా స్పష్టం చేసింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరిశ్రమలు, దుకాణ సముదాయాలు, ఫ్యాక్టరీల్లో నియంత్రణా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. రవాణా వాహనాలు, యంత్రాలు, ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు వైరస్ రహితంగా చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం శానిటైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టాల్సిందిగా స్పష్టం చేసింది. వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, దుకాణాల్లోకి ప్రవేశించే సమయంలో థర్మల్ స్కానింగ్ చేయాల్సిందిగా సూచనలు చేసింది. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం విధిగా పాటించేలా చూడాలని స్పష్టంగా తెలిపింది