Begin typing your search above and press return to search.

కరోనా వరల్డ్ అప్డేట్: 42వేల మరణాలు.. అమెరికాలో దారుణం.. ఏపీలో కల్లోలం

By:  Tupaki Desk   |   1 April 2020 4:12 AM GMT
కరోనా వరల్డ్ అప్డేట్: 42వేల మరణాలు.. అమెరికాలో దారుణం.. ఏపీలో కల్లోలం
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి మొత్తం 200 దేశాలకు విస్తరించి వికటట్టహాసం చేస్తోంది. వేలాది మందిని బలితీసుకుంటోంది. కరోనా వైరస్ ధాటికి ప్రపంచంలోని సగం కంటే ఎక్కువ దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం రోజుకు ప్రపంచవ్యాప్తంగా 70వేల మంది వైరస్ బారిన పడి చనిపోతున్నారు.

కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఏకంగా బుధవారానికి 42వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 8.50 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా మరో 4వేల మంది మృత్యువాతపడ్డారు. ఇటలీ, స్పెయిన్ దేశాల్లోనే 22వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక కరోనా మరణాల్లో అగ్రరాజ్యం అమెరికా ఏకంగా చైనాను దాటేయడం సంచలనంగా మారింది. కరోనా బాధితుల సంఖ్యలో అమెరికాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా 8.52 లక్షల మందికి పైగా కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. 1,78,000 మంది కోలుకున్నారు. మరో 6.05 లక్షల మందిలో వైరస్ లక్షణాలు స్వల్పంగా కనిపించాయి. దాదాపు 33వేల మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రపంచంలో అత్యదిక కరోనా కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది. మంగళవారం ఏకంగా 24వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో పాజిటివ్ కేసులు 1.88 లక్షలు దాటాయి. న్యూయార్క్, న్యూజెర్సీలో తీవ్రత ఎక్కువగా ఉంది.

మొత్తం మరణాల్లో 60శాతం యూరప్ దేశాల్లోనే ఉన్నాయి. ఇటలీలో రోజుకు సగటున 850మంది చనిపోతున్నారు. ఇటలీలో 12500 మందికి పైగా కరోనా సోకగా.. మంగళవారం ఒక్కరో 900 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల్లో స్పెయిన్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ప్రాన్స్, ఇరాన్, బ్రిటన్ లో కరోనా స్వైర విహారం చేస్తోంది. జర్మనీలో తీవ్రత అధికంగా ఉంది.

ఇక చైనాలో కొత్తగా 50 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఎవరూ చనిపోలేదు. ఆ దేశంలో మరణాల సంఖ్య 3309కు చేరింది. బాధితుల సంఖ్య 81580కి చేరింది.

*ఏపీలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం 58కి కేసులు
ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి వరకు 44 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 58కి చేరింది. ఏలూరులో 6, భీమవరంలో 2, పెనుగొండలో 2, గుండుగొలను, అకివీడు, నారాయణపురంలో ఒక్కొటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్టు కలెక్టర్ తెలిపారు. ఢిల్లీలోని మార్కాజ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారే ఎక్కువ మంది ఉన్నారు.

*తెలంగాణలో 97కు చేరిన కరోనా కేసులు
తెలంగానలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కు చేరింది. మంగళవారం ఒక్కరోజే మొత్తం 15 కేసులు నమోదైనట్టు తెలిసింది. ఈ కేసుల్లో ఎక్కువమంది ఢిల్లీ మర్కజ్ సదస్సుకు వెళ్లిన వారేనని తెలుస్తోంది. తెలంగానలో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. 14మంది డిశ్చార్జి అయ్యారు.

*భారత్ లో 1400కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
భారత దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మంగళవారంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1397కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా నుంచి 124మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో 35మంది మృతిచెందారు.