Begin typing your search above and press return to search.

ప్రపంచానికి మరో సవాల్ విసిరిన కరోనా

By:  Tupaki Desk   |   13 Nov 2020 11:15 AM IST
ప్రపంచానికి మరో సవాల్ విసిరిన కరోనా
X
ఓవైపు కేసుల నమోదు తగ్గుముఖం పట్టిందన్న ఆనందంలో ఉన్న సగటు భారతీయుడు.. కరోనా గురించి లైట్ తీసుకోవటం షురూ చేశాడు. సరిగ్గా ఇలాంటి తీరునే ప్రదర్శించిన అమెరికా.. యూరప్ దేశాలు సెకండ్ వేవ్ ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మన దేశానికి సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని.. ఏ రోజైనా అది బద్ధలు కావొచ్చన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. ప్రపంచానికి కరోనా మరో సవాలు విసిరినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు మనుషుల నుంచి మనుషులకు మాత్రమే సంక్రమించే కరోనా.. ఇప్పుడు మింక్ అనే జీవిలోకి ప్రవేశించటమే కాదు.. వాటి నుంచి తిరిగి మనుషులకు వ్యాప్తి చెందే సీరియస్ అంశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ కొత్త వ్యవహారం డెన్మార్క్ లో ఎక్కువగా కనిపిస్తోంది. ఆ దేశంలో మింక్ అనే జీవుల్ని భారీగా పెంచుతుంటారు. తాజాగా కరోనా వైరస్ వాటిలో కనిపించటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఈ ప్రమాదకరమైన పరిణామం రానున్న రోజుల్లో మరింత ఇబ్బంది పెట్టే వీలుంది. అందుకే.. ఆ దేశంలోని 1.7కోట్ల మింక్ జీవుల్ని చంపేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడు వచ్చిన సమస్య ఏమంటే.. ఇంతకాలం మనిషి నుంచి మనిషికి కోవిడ్ 19 వైరస్ సంక్రమిస్తోంది. తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో మనిషి నుంచి మింక్ జీవుల్లోకి వెళ్లిన వైరస్.. తనను తానుకొన్ని మార్పులు చేసుకొని తిరిగి మనిషిలోకి ప్రవేశించటం ప్రమాకరంగా చెబుతున్నారు. ఇంతకీ ఈ మింక్ జీవుల్ని ఎందుకు పెంచుతారు? అన్న విషయంలోకి వెలితే.. వాటిని ఉన్ని కోసం డెన్మార్క్ లో భారీగా పెంచుతారు. వీటిని పెంచే కేంద్రాల్లో ఉన్న వారికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. దీంతో.. ముందస్తు జాగ్రత్త కోసం పరిశోధనలు చేయగా.. మింక్ జీవుల్లోనూ కరోనా వైరస్ జాడలు కనిపించటమే కాదు.. వాటి ద్వారా మనుషులకు తిరిగి వస్తున్న వైనంతో ఉలిక్కిపడటమే కాదు.. దీనికి సొల్యుషన్ ఏమిటన్నది ప్రశ్న ఇప్పుడు శాస్త్రవేత్తల్ని వేధిస్తోంది.