Begin typing your search above and press return to search.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ః ఈ ఆరోగ్య స‌మ‌స్య ఉన్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ట‌!

By:  Tupaki Desk   |   9 July 2021 11:30 PM GMT
క‌రోనా థ‌ర్డ్ వేవ్ః  ఈ ఆరోగ్య స‌మ‌స్య ఉన్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ట‌!
X
''క‌రోనా వ‌స్తే ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంటుంది'' అని మాత్రమే చాలా మంది జనాలకు తెలుసు. కానీ.. ఏ యే కార‌ణాల‌తో చ‌నిపోతారు? క్షేమంగా బయటపడేవారు ఎలా సేఫ్ గా ఇంటికొస్తున్నారు? కొవిడ్ ప్రాణాంతకంగా ఎప్పుడు మారుతుంది? అన్న విష‌యాలు దాదాపుగా సామాన్యులు ఎవ‌రికీ తెలియ‌దు. వైద్యుల‌కు సైతం దీనిపై పూర్తిస్థాయి క్లారిటీ లేద‌ని కూడా చెప్పొచ్చు. అందుకే.. ఎవ‌రి ప్ర‌యోగాలు వారు చేస్తున్నారు. రోజుకో కొత్త అధ్య‌య‌నం బ‌య‌టికి వ‌స్తోంది. అదో.. కొత్త విష‌యాన్ని మోసుకొస్తోంది. తాజాగా.. మ‌రో కొత్త నివేదిక వ‌చ్చింది. మ‌న ఎయిమ్స్ వైద్యులు జ‌రిపిన ప‌రిశోధ‌న‌కు సంబంధించి కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. మ‌రి, ఆ నివేదిక ఏం చెబుతోంది? అన్న‌ది చూద్దాం.

వైద్యులు మొద‌ట్నుంచీ చెబుతున్న విష‌యం ఏమంటే.. ఎలాంటి దీర్ఘ కాలిక రోగాలు లేనివారిని క‌రోనా ఏమీ చేయ‌లేద‌ని. లంగ్స్‌, లివ‌ర్‌, కిడ్నీ, గుండె సంబంధిత రోగాల‌తో బాధ‌ప‌డుతున్న‌వారికి ఇబ్బంది కాస్త ఎక్కువ‌గా ఉంటుంద‌ని, వారు త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో, ధైర్యంతో మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాల‌ని చెబుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఎయిమ్స్ వైద్యులు సైతం ఇదేవిధ‌మైన అభిప్రాయం వ్య‌క్తం చేశారు. థ‌ర్డ్ వేవ్ ఘంటిక‌లు మోగుతున్న వేళ‌.. కీల‌క‌మైన విష‌యం చెప్పారు. ఇప్ప‌టికే కిడ్నీలు పాడైపోయిన వారు, పాక్షికంగా దెబ్బ‌తిన్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

నోయిడాలోని జేపీ హాస్పిటల్‌లోని సీనియర్ కిడ్నీ మార్పిడి సర్జన్ డాక్టర్ అమిత్ దేవా చెబుతున్న వివ‌రాల‌ ప్రకారం.. న్యుమోనియా కారణంగా రక్తంలో ఆక్సీజన్ స్థాయి త‌క్కువ‌గా ఉంటుంది. దీనివల్ల కిడ్నీలో ఏటీఎన్ స‌మ‌స్య వ‌స్తుంద‌ట‌. అంటే.. ట్యూబ్యూల్ దెబ్బతినడం జ‌రుగుతుంద‌ట‌. కరోనా తీవ్రమైన సందర్భాల్లో.. కిడ్నీలతోపాటు ఇత‌ర అవయవాల మీద ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పారు. ఇది ఆయా అవ‌య‌వాల్లో తీవ్రమైన వాపున‌కు దారితీస్తుంది, కిడ్నీల విష‌యానికి వ‌చ్చిన‌ప్పుడు భారీ నష్టం కలిగిస్తుంద‌ని దేవ్రా చెబుతున్నారు.

మూత్రపిండాలు శరీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. నిత్యం లీట‌ర్ల కొద్దీ నీటిని శుద్ధి చేస్తాయి. దీని ప‌నితీరును క‌రోనా వైర‌స్ డిస్ట్ర‌బ్ చేస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ -19 వైర‌స్ ర‌క్తం ప్ర‌వ‌హించే నాళాల్లో గడ్డకట్టడానికి కారణమవుతుందట‌. ఇది మూత్రపిండంలోని అతిచిన్న రక్త నాళాలను సైతం అడ్డుకుంటుందట‌. దీంతో.. కిడ్నీల ప‌నితీరు క్ర‌మ క్ర‌మంగా దెబ్బతీస్తుందని వైద్యులు అంటున్నారు.

ఒక వ్యక్తికి మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాల్లో రాళ్ళు వంటి స‌మ‌స్య‌ల‌తోపాటు ఇత‌ర‌త్రా అనారోగ్యాలు ఉంటే.. వారికి క‌రోనా వైర‌స్ సోకితే.. కిడ్నీ సమస్య‌లు కూడా ఎదుర‌య్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇత‌ర అనారోగ్యాల‌తో బాధ‌ప‌డుతున్న వారి విష‌యంలో కొవిడ్ మందులు కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపే అవ‌కాశం ఉంద‌ని డాక్ట‌ర్లు అంటున్నారు.

అందువ‌ల్ల‌.. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. ఒక‌వేళ ఇలాంటి వారికి పాజిటివ్ వ‌స్తే.. వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని చెబుతున్నారు. కొవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత కూడా.. కనీసం మూడు నెలల వరకు క్ర‌మం త‌ప్ప‌కుండా వైద్యుల వ‌ద్ద‌కు వెళ్లిరావాల‌ని చెబుతున్నారు. థ‌ర్డ్ వేవ్ ప్ర‌చారం నేప‌థ్యంలో ఈ అధ్య‌య‌నం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే.. దేశంలో థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని ప‌లు నివేదిక‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఎస్బీఐ నివేదిక సైతం మూడో ద‌శ క‌రోనా రావ‌డానికి అవ‌కాశం ఎక్కుగా ఉంద‌ని తెలిపింది. ఆగ‌స్టు మొదటి నాటికే ప్రారంభం కావొచ్చ‌ని, సెప్టెంబ‌ర్ చివ‌రి నాటికి పీక్ స్టేజ్ కు చేరుతుంద‌ని వెల్ల‌డించింది. మ‌రి, ఏం జ‌రుగుతుంది? థ‌ర్డ్ వేవ్ వ‌స్తుందా? రాదా? అన్న‌ది చూడాలి. అదే స‌మ‌యంలో.. పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుందా? అందరిపైనా దాడి చేస్తుందా? అన్న‌ది కూడా క్లారిటీ లేదు.