Begin typing your search above and press return to search.

ఫిబ్రవరిలో ఏం జరుగుతుందో చెప్పేసిన ప్రముఖురాలు

By:  Tupaki Desk   |   13 Jan 2022 4:53 AM GMT
ఫిబ్రవరిలో ఏం జరుగుతుందో చెప్పేసిన ప్రముఖురాలు
X
మూడో వేవ్ వచ్చేసింది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అంతోఇంతో ఉపశమనం ఏమంటే.. రోజుకు దగ్గర దగ్గర 2 లక్షల కేసులు నమోదువుతున్నా.. ఆసుపత్రులు కిటకిటలాడిపోవటం.. వైద్యం కోసం బారులు తీరటం.. మరణాల రేటు లేకపోవటం.. అత్యవసర వైద్యం కోసం హడావుడి లాంటివి లేని పరిస్థితి. ఇలాంటివేళ.. మూడో వేవ్ ఎంత కాలం ఉంటుంది? దాని ప్రభావం ఎంత ఉండనుంది? ప్రస్తుత పరిస్థితులే రానున్న రోజుల్లోనూ ఉంటాయా? అసలేం జరుగుతోంది? లాంటి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు ప్రముఖ వైరాలజిస్టు ప్రొఫెసర్ గగన్ దీప్ కాంగ్.

తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఆమె తాజాగా తెలుగు మీడియాకు చెందిన ఒక ప్రముఖ సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక అంశాల్ని చెప్పుకొచ్చారు. అన్నింటికి మించి.. ప్రస్తుతం మొదలైన మూడోదశ.. ఫిబ్రవరి మొదటి వారానికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని.. ఆ సమయంలో భారీ ఎత్తున కేసులు నమోదు అవుతాయని పేర్కొన్నారు.

అంతకాదు.. ఫిబ్రవరిలో కేసుల సంఖ్యతో పాటు.. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనాను ఆమె వెల్లడించారు. రెండు నుంచి నాలుగు వారాల్లో ఒమిక్రాన్ తో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య.. మరణాలు ఎక్కువగా ఉంటాయని.. జనవరి ఆఖరులో ఫిబ్రవరిలో ఆరంభంలో గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదు కావటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. మొన్న డెల్టా.. ఇప్పుడు ఒమిక్రాన్.. మరి రేపేంటి? భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన వేరియంట్లు వచ్చే అవకాశం ఉందా? అంటే.. కచ్ఛితంగా ఉందనే చెబుతన్నారు. మరి.. దీనికి సమాధానం ఏమిటంటే.. అందరికి వ్యాక్సిన్ ఇవ్వటమే దీనికి పరిష్కారమని చెబుతున్నారు.

ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వటం కారణంగా వైరస్ లోడు తగ్గుతుందని చెప్పారు. అంతేకాదు.. కొత్త వేరియంట్స్ ఏమేం వస్తున్నాయన్న దానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. వ్యాక్సిన్లు.. వాటికున్న సామర్థ్యం ఎంత అన్న దానిపై సరైన డేటా అందుబాటులో లేదని ఆమె చెప్పారు. యూకేలో జరిపిన అధ్యయనంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఆసుపత్రి అవసరం లేకుండా 70 శాతం రక్షణ అర్నెల్ల పాటు ఉంటుందని.. ఆ తర్వాత 55 శాతానికి పడిపోతుందని చెప్పారు. అయితే.. బూస్టర్ డోసు కారణంగా ఈ రక్షణ 85 శాతం వరకు ఉంటుందని ఆమె చెబుతున్నారు. సో.. బూస్టర్ డోస్ ప్రాధాన్యత ఏమిటన్న విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పారని చెప్పాలి.