Begin typing your search above and press return to search.

కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది: భారీగా కొత్త కేసులు

By:  Tupaki Desk   |   11 July 2021 4:40 AM GMT
కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది: భారీగా కొత్త కేసులు
X
కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజానీకానికి మరో షాక్ తగిలింది. కరోనా పీడ విరగడ అయ్యిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో ఉపద్రవం వచ్చిపడింది.. జనాల నిర్లక్ష్యం.. వైరస్ రూపాంతరం ఇలా సవాలక్ష కారణాలు కరోనా వైరస్ బలపడి విరుచుకుపడడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనాలు నిబంధనలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పందంటున్నారు.

తాజాగా థర్డ్ వేవ్ మొదలైంది. కానీ మన దేశంలో కాదు.. అమెరికా కింద ఉండే మెక్సికో దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది. మెక్సికోలో మూడో దశ కరోనా వ్యాప్తి ప్రారంభమైందని ఆ దేశ ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది. వారం రోజులుగా అక్కడ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. గత వారం కంటే ఈ వారం 29శాతం అధికంగా కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

గత ఏడాది రెండో వేవ్ తో పోల్చితే ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయని మెక్సికో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీని తీవ్రత మరింత భయానకంగా ఉండొచ్చని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

ఇప్పటికే మెక్సికో దేశంలో కరోనా థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అక్కడి నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. థర్డ్ వేవ్ లో ఎక్కువగా యువతపైనే ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రజల్లో వ్యాక్సిన్లతో రోగ నిరోధక శక్తి పెరిగి మరణాల రేటు మాత్రం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

మొత్తంగా మెక్సికోలో మొదలైన థర్డ్ వేవ్ ముప్పు పక్కనే ఉన్న అమెరికాకు.. ఆ తర్వాత ప్రపంచ దేశాలకు పాకే ప్రమాదం ఉంది. అందుకే ప్రజలంతా అలెర్ట్ గా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. భారత్ లోనూ ఆగస్టు లో థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.