Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కరోనా అనుమానితుల్ని అలా వదిలేశారే..

By:  Tupaki Desk   |   6 Feb 2020 5:30 AM GMT
హైదరాబాద్ లో కరోనా అనుమానితుల్ని అలా వదిలేశారే..
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. మంగళవారం రాత్రి ఇద్దరు కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రికి రాగా.. వారి నమూనాలు సేకరించకుండానే ఇంటికి పంపేయటంపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ అనుమానితులు వుహాన్ నుంచి కొచ్చిన్ కు ప్రయాణించి.. వారికి అత్యంత సమీపంగా గడిపిన వ్యక్తులుగా చెబుతున్నారు.

అనుమానితులుగా గాంధీ ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు ఎయిర్ హోస్టేస్ ల నుంచి రక్త నమూనాల్ని అత్యవసరంగా సేకరించి.. రాత్రికి రాత్రే పరీక్షించాల్సి ఉంది. కానీ.. అందుకు భిన్నంగా గాంధీ ఆసుపత్రి వైద్యులు ఉదాసీనంగా వ్యవహరించారు. గాంధీ వైద్యులు చేసిన తప్పును గుర్తించిన వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు ఇద్దరు ఎయిర్ హోస్టెస్ తో పాటు మరో ప్రయాణికుడ్ని కూడా గుర్తించి వారిని గాంధీకి తీసుకొచ్చి నమూనాలు సేకరించినట్లుగా తెలిసింది.

ఈ నేపథ్యం లో పరీక్షల ఫలితాలు ఎలా వస్తాయన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. కరోనా లాంటి ప్రమాదకరమైన వైరస్ లక్షణాల మీద అనుమానం ఉంటే.. వారిని ప్రత్యేకంగా ఉంచాల్సిన అవసరం ఉంది. పరీక్షలు చేసి.. ఫలితాలు రాక ముందే ఇంటికి పంపేయటంపై కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ అయ్యింది. దీంతో కంగారుపడ్డ గాంధీ సిబ్బంది ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన వారిని వెతికి పట్టుకునేందుకు విపరీతంగా శ్రమించారు.

చివరకు మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ముగ్గురు అనుమానితుల్ని వెతికి పట్టుకొచ్చారు. తాము వారిని ఆపే ప్రయత్నం చేసినా.. తమ మాట వినకుండా వెళ్లి పోయినట్లుగా సర్ది చెప్పినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ అధికారులు సీరియస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ 37 మందికి పరీక్షలు చేస్తే.. 25 మందిలో వైరస్ లేదని తేలగా.. మరో పన్నెండు మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. అత్యంత ప్రమాద కరమైన కరోనా వైరస్ అనుమానితుల విషయంలో గాంధీ సిబ్బంది వ్యవహరించిన నిర్లక్ష్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.