Begin typing your search above and press return to search.

టీమిండియాకి కరోనా షాక్ .... ఒక ప్లేయ‌ర్‌కు పాజిటివ్‌

By:  Tupaki Desk   |   15 July 2021 8:30 AM GMT
టీమిండియాకి కరోనా షాక్ ....  ఒక ప్లేయ‌ర్‌కు పాజిటివ్‌
X
టీమిండియాకి కరోనా వైరస్ మహమ్మారి ఊహించని షాక్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్ల‌లో ఒక‌రికి కరోనా సోకిన విష‌యం ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా వెల్లడించింది. గొంతునొప్పితో బాధ‌ప‌డుతున్న ఆ ఆట‌గానికి క‌రోనా నిర్దారణ టెస్ట్ నిర్వ‌హించ‌గా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్టుగా వెల్లడించింది. దీంతో ఆ ఆట‌గానితో స‌న్నిహితంగా మెలిగిన‌వారిని ఇప్ప‌టికే మూడు రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉంచిన‌ట్టుగా తెలుస్తోంది. అయితే , ఆ అతగాడి పేరును మాత్రం వెల్లడించడానికి బీసీసీఐ ఇష్టపడలేదు.

ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌ లో డెల్టా వేరియెంట్ డేంజ‌ర‌స్‌ గా మారింది. ఈ క్ర‌మంలోనే ముందు జాగ్ర‌త్త‌గా ఆట‌గాళ్ల‌కు క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ, ఒక క్రికెటర్ కు ఆ తరువాత నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మరో క్రికెటర్ మాత్రం క్వారంటైన్ లో ఉన్నాడు. అతనికి మళ్లీ జూలై 18వ తేదీన కరోనా పరీక్షలు చేస్తారు. కరోనా సోకిన ఇద్దరు క్రికెటర్లకు ఎటువంటి లక్షణాలు కనిపించలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కొద్దిరోజుల క్రితం ఆ క్రికెటర్లు ఇద్దరూ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కనిపించారని ఇంగ్లాండ్ మీడియా చెబుతోంది.

ఇకపోతే , ఇప్పటికే భారత క్రికెటర్లు అందరూ మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరు తమ రెండో మోతాదును ఇంగ్లాండ్ లో తీసుకోవాల్సి ఉంది. గత నెల ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పోటీ తరువాత ఇంగ్లాండ్ టీమ్ తో భారత జట్టు టెస్ట్ సిరీస్ లో తలపడాల్సి ఉంది. అయితే, దీనికి 40 రోజుల పైగా సమయం ఉండడంతో టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. దీనితో పాటూ వారు యూకేలో ఎక్కడైనా తిరిగే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు ఇంగ్లాండ్ లోని పలు ప్రాంతాల్లో కుటుంబాలతో సహా తిరిగారు. కొంతమంది వింబుల్డన్, యూరోకప్ వంటి క్రీడల పోటీలను చూడటానికి వెళ్లారు. గురువారం టీమంతా డ‌ర్హ‌మ్ వెళ్ల‌నుండ‌గా.. ఆ ప్లేయ‌ర్ మాత్రం టీమ్‌తో పాటు వెళ్ల‌డం లేదు. యూకేలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయ‌ని, అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఈ మ‌ధ్యే బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా ఇండియ‌న్ టీమ్ స‌భ్యుల‌కు మెయిల్ పంపించ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవల ఇంగ్లండ్ టీంలో కూడా ఏకంగా ఏడుగురిలో క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డింది. పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ స‌మ‌యంలో ఇది చోటు చేసుకుంది. పాకిస్తాన్తో జరిగిన మొదటి మ్యాచ్లో సరికొత్త జట్టును రంగంలోకి దించారు. అయితే, కరోనా సోకిన ఆటగాళ్లందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు. దీని తరువాత, కరోనాకు సంబంధించి ఇంగ్లాండ్ జట్టులో పరిస్థితుల గురించి భారత జట్టు యాజమాన్యానికి తెలుసునని బిసిసిఐ తెలిపింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ షెడ్యూల్ మార్చమని లేదా కొత్త ప్రోటోకాల్ ఇవ్వమని అడిగితే, మేము దానిని అనుసరిస్తాము. ప్రస్తుతం, షెడ్యూల్‌ లో మార్పులు చేయలేదు అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

టీం ఇండియా జూలై 20 నుంచి 22 వరకు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సివుంది. కౌంటీ ఛాంపియన్‌ షిప్ XI జట్టుతో భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. దీని తరువాత ఆ గస్టు 4 నుంచి ప్రారంభమయ్యే 5 టెస్టుల సిరీస్‌ లో టీమ్ ఇండియా ఆగస్టు సెప్టెంబర్‌ లో ఇంగ్లండ్‌ తో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడవలసి ఉంది. మొదటి మ్యాచ్ ఆగస్టు 4 న నాటింగ్‌ హామ్‌ లో ప్రారంభమవుతుంది.