Begin typing your search above and press return to search.

కరోనాకు యూరప్ గజగజ.. పరిపాలనంతా షట్ డౌన్

By:  Tupaki Desk   |   17 March 2020 11:30 PM GMT
కరోనాకు యూరప్ గజగజ.. పరిపాలనంతా షట్ డౌన్
X
కరోనా వైరస్ ధాటికి యూరప్ అతలాకుతలమవుతోంది. చైనా తర్వాత అత్యధికంగా ప్రభావితమవుతున్న ప్రాంతం యూరప్. యూరోపియన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. చల్లటి ప్రాంతంగా ఉండడం తో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రమవుతుండడం తో పెద్ద సంఖ్యలో ఈ వైరస్ బారిన ప్రజలు పడుతున్నారు. వాతావరణం చల్లగా ఉండటం తో వైరస్ నివారణ సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా ఇటలీలో కరోనా మృతులు 1,800మంది దాటడం తో పెద్దసంఖ్యలో కోవిడ్ కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు స్పెయిన్ గజగజ వణుకుతోంది. ఈ దేశంలో కరోనా బాధితులు 9,942కు చేరగా, 342 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా ఆ దేశాలు అత్యవసర పరిస్థితులను ప్రకటించారు.

ఫ్రాన్స్‌ లాక్‌డౌన్‌ ప్రకటించగా, మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు యూరప్‌ తన సరిహద్దులను మూసివేసింది. విదేశీయులు ఎవరూ అడుగుపెట్టకుండా 30 రోజుల పాటు సరిహద్దులను మూసివేయాలని యూరప్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇటలీ లో కరోనా మృతులు పెరగడం, కొత్త కేసులు వేగంగా నమోదవుతుండడం తో దీని నివారణలో ఆ దేశం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అమెరికాలోనూ కొవిడ్‌ 19 వ్యాప్తి తో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహమ్మారి వైరస్‌పై నెలల తరబడి పోరాటం సాగించాల్సి ఉందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికాలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఫిలిప్పీన్స్‌లో ఫైనాన్షియల్‌ మార్కెట్లను నిలిపివేశారు.

అయితే ఈ మహమ్మారిని ఎలాగైనా కట్టడి చేయాలని యూరప్ దేశం స్పెయిన్ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు ఏ దేశం తీసుకోని సంచలన నిర్ణయం తీసుకుంది. స్పెయిన్‌లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలన్నింటిని జాతీయం చేసింది. దీంతో ఆ దేశంలో అన్ని ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లాగా పనిచేయనున్నాయి. అంతేకాదు కరోనా బాధితులు ఇప్పుడు స్పెయిన్‌లోని ఏ ఆస్పత్రికి వెళ్లినా ఖర్చులన్నీ ఉచితమే. ఈ చర్య వలన కరోనా బాధితుల నుంచీ ప్రైవేట్ ఆస్పత్రులు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. దీని వలన వైద్యం అందుబాటులోకి వచ్చి కరోనా నివారణ సాధ్యమవుతుందని ఆ దేశం భావిస్తోంది.