Begin typing your search above and press return to search.

థ్యాంక్స్ టు కరోనా.. ప్రభుత్వాన్ని కాపాడింది

By:  Tupaki Desk   |   16 March 2020 8:45 AM GMT
థ్యాంక్స్ టు కరోనా.. ప్రభుత్వాన్ని కాపాడింది
X
మధ్యప్రదేశ్ లో నెలకొన్న ప్రభుత్వ సంక్షోభంపై సోమవారం అటోఇటో తేలుతుందని అందరూ భావించగా అనూహ్యంగా కరోనా వైరస్ వచ్చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం తో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఓ సాకు తో ఏకంగా అసెంబ్లీని వాయిదా వేయడం తో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఉఫ్ అని ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే బలం నిరూపించుకోవాల్సిన సమయంలో బలం లేకపోతే ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఆ గండం కరోనా వైరస్ రూపేణ గట్టెక్కడం తో ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం స్థిరంగా కొనసాగనుంది.

మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ కు బైబై చెప్పేసి తన వర్గం ఎమ్మెల్యేలు 22 మంది తో రాజీనామాలు చేయించడం తో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రభుత్వానికి సంక్షోభం ఏర్పడడం తో రాజకీయం రసకందాయంగా మారింది. ఈ నేపథ్యం లో మధ్య ప్రదేశ్ లో హైడ్రామా కొనసాగుతుండగా సోమవారం అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. అయితే ముఖ్యమంత్రి కమల్ నాథ్ బల నిరూపణకు సిద్ధమని బహిరంగంగా ప్రకటించడంతో ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బల నిరూపణకు అవకాశం ఇస్తారని అందరూ భావించారు. ఈ మేరకు సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు తీవ్ర ఉత్కంఠగా జరిగాయి.

అయితే అనూహ్యంగా కరోనా వైరస్‌పై దేశవ్యాప్తంగా నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో అసెంబ్లీని ఈ నెల 26వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రజాపతి ప్రకటించారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలన్న గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాలను స్పీకర్ పక్కనబెట్టారు. ఈ పరిణామం తో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు పది రోజుల ఊరట లభించింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు కొంత వాయిదా పడింది. ఈ సందర్భంగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ పది రోజుల పాటు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తీవ్రంగా ఉంది. ఈలోపు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవచ్చని ముఖ్యమంత్రి కమల్ నాథ్ భావిస్తున్నారు. వెళ్లిన వారు కూడా తిరిగివస్తారనే భావన తో పాటు వారి రాజీనామాలు ఆమోదం తెలపకుండా స్పీకర్ తో మంతనాలు చేసే అవకావం కూడా ఉంది. ఏది ఏమైనా కరోనా వైరస్ ప్రభావం తో తమ ప్రభుత్వానికి కొంత రిలీఫ్ రావడంతో కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. అందుకే థ్యాంక్స్ టు కరోనా వైరస్ అంటూ పేర్కొంటున్నారు.